Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురిటి దశ నుంచే తెలంగాణపై కేంద్రం దాడి : మోడీ సర్కారుపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- నాడు సమైక్యపాలకుల వివక్ష... నేడు బీజేపీ చిన్నచూపు
- బడ్జెట్ ప్రతిపాదన సందర్భంగా మంత్రి ఆవేదన
తెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర బడ్టెట్ అంకెల సముదాయం కాదనీ, అది ప్రజల ఆశలు, ఆకాంక్షల వ్యక్తీకరణేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ఉందని చెప్పారు. సోమవారం తెలంగాణ శాసనసభలో 2022-23 సంబంధిం చిన వార్షిక బడ్జెట్‌ను ఆయన ప్రవేశ పెట్టారు. తెలంగాణ అభివృద్ధి కోసం, జాతి నిర్మాణం కోసం ప్రతిఘాతక శక్తుల అవరోధాలను పట్టించుకోబోమన్నారు. తెలంగాణ అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం పునరంకితమై పని చేస్తున్నదని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం, చూపుతున్న వివక్షపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. నాడు సమైక్య పాలకులు ఈ ప్రాంతంపై తీవ్ర వివక్షత ప్రద ర్శించారనీ, నేడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తున్నదని విమర్శించారు. అయినా ఏడేండ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్లను విప్పుకుంటూ, స్పష్టతను సాధిస్తూ... క్రమక్రమంగా ఒక్కో సమస్యనూ పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. సంక్షోభ కాలం నుంచి సంక్షేమ యుగంలోకి ప్రవేశించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి మాత్రం ప్రతికూలంగా ఉందనీ, తెలంగాణ ప్రజల మాటల్లో చెప్పాలంటే 'కాళ్లల కట్టె పెట్టినట్టు' ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మనోభావాలను కేంద్రం దెబ్బతీస్తున్నది
తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పటి నుంచే కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంపై దాడి ప్రారంభించిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శిం చారు. ఇవి చాలవన్నట్టు ప్రతీసారి 'తల్లిని చంపి బిడ్డను బతికించారు' అంటూ పదే పదే కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ ప్రజల మనోభావాలను దారుణంగా దెబ్బతీస్తు న్నారని చెప్పారు. ఏడు మండలాలను ఏపీలో కలపడంతో లోయర్ సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును తెలంగాణ కోల్పోయిం దని చెప్పారు.రాష్ట్రానికి గుండెకాయలాంటి ఐటీఐఆర్ వంటి భారీ ప్రాజెక్టును అమలు చేయకుండా కేంద్రం తీరని అన్యాయం చేసిందన్నారు.దాన్ని ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించేదన్నారు. రాష్ట్రంలో 9 ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిందనీ, అయినా నిధులు ఇవ్వడంలో విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కో-ఆపరేటివ్ ఫెడరలిజమంటూనే...మరోవైపు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అధికారాలను హరించివేస్తున్నదని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పథకాలక ప్రత్యేక నిధులు ఇవ్వాలనే నిటి అయోగ్ సిఫారులను కేంద్రం బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. విభజన చట్టంలోని హామీలైన బయ్యారం స్టీల్ ప్లాంటు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల విషయంలో అతీగతీలేదనీ, రైల్ కనెక్టివిటీ పెంచే ప్రతిపాదనలను పెండింగ్‌లో పెడుతున్నదని చెప్పారు. గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కంటితుడుపుగా కేవలం రూ 20 కోట్లను విదిల్చిందని విమర్శించారు. జహీరాబాద్‌లోని 'నిమ్జ్' సంబంధించి కేంద్రం వాటా రూ 500 కోట్ల రూపాయలను ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ఇచ్చే నిర్దిష్ట గ్రాంట్లు రూ 2362 కోట్లను విడుదల చేయలేదన్నారు. ఆ సమయంలోనూ కేంద్రం రాష్ట్రాలకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని విమర్శించారు. ఎఫ్ఆర్బీఎమ్ పెంపుదలకు, విద్యుత్తు సంస్కరణలకు లంకె పెడుతూ కేంద్రం రాష్ట్రాల మెడ మీద కత్తి పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదనీ, ఒక్క పథకానికీ డబ్బులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కారువి అవీ శుష్క ప్రియాలు, శూన్య హస్తాలేనన్నారు. రాష్ట్రాలకు 41శాతం పన్నులు రావాల్సిన చోట 29.6 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.