Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి
- సాధారణ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలి
- సీఎస్‌కు యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో అమలు సందర్భంగా నష్టపోయిన ఉపాధ్యాయుల అప్పీళ్లను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని కోరింది. సాధారణ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను ప్రకటించాలని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌కు మంగళవారం యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ వినతిపత్రం ఆన్లైన్ ద్వారా పంపించింది.
317 జీవో అమలు సందర్భంగా సీనియార్టీ నిర్ణయంలో తప్పిదాలు, ఉద్యోగ దంపతుల ఎడబాటు, స్పెషల్ కేటగిరీ వర్తింపులో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని వివరించింది. వారు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి అప్పీల్ చేసుకున్నారని పేర్కొంది. ఆ అప్పీళ్లలో 19 జిల్లాల స్పౌజ్ కేసులు కొన్ని, సీనియార్టీ సంబంధించి కొన్ని మాత్రమే పరిష్కారం చేశారని తెలిపింది. తిరస్కరించిన అప్పీళ్ల వివరాలు వెల్లడించలేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంకా పలువురి అప్పీళ్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం (డీఎస్ఈ)లోనే పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది.
ఆలస్యంగా అందిన మొదటి జాబితాలో పేర్లు గల్లంతైన అర్హులైన ఉపాధ్యాయులు మళ్లీ చేసుకున్న దరఖాస్తులను పరిశీలించనే లేదని విమర్శించింది. హోల్డ్‌లో ఉంచిన 13 జిల్లాల స్పౌజ్ అప్పీళ్లు 2,650 ఉంటే కేవలం 300 మాత్రమే పరిష్కారం చేశారని పేర్కొంది. మిగిలిన అప్పీళ్లు ఎప్పుడు పరిష్కారం చేస్తారో తెలియక సంబంధిత ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని తెలిపింది వితంతువులు, ఒంటరి మహిళల పట్ల సానుభూతితో వ్యవహరించి స్పెషల్ కేటగిరీగా పరిగణించాలంటూ హైకోర్టు సూచించిందని గుర్తు చేసింది. ఇంటర్ లోకల్ క్యాడర్ పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకోవటానికి ఈనెల 15 వరకే గడువు ఇచ్చారని తెలిపింది. ఈలోగా స్పౌజ్, వితంతువులు, ఒంటరి మహిళలు, సీనియార్టీ, స్పెషల్ కేటగిరీ అప్పీళ్లను పరిష్కారం చేయాల్సిన అవసరముందని సూచించింది. ఆ అప్పీళ్లు తిరస్కరించిన ఉపాధ్యాయులు కనీసం పరస్పర బదిలీకు ప్రయత్నం చేసుకుంటారని వివరించింది. 317 జీవో ద్వారా ఏర్పడిన వివాదాలన్నింటినీ సత్వరమే సానుకూలంగా పరిష్కరించాలని కోరింది. గత ఏడేండ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియను చేపట్టాల్సిన అవసరముందని సూచించింది.
యూఎస్పీసీ డిమాండ్లు :
- పరిష్కరించిన, తిరస్కరించిన అప్పీళ్ల వివరాలను బహిర్గతం చేయాలి.
- 19 జిల్లాల స్పౌజ్ అప్పీళ్లలో మొదటి జాబితాలో పేర్లు గల్లంతు లేదా తదుపరి వచ్చిన అప్పీళ్లను పరిష్కారం చేసి రెండో జాబితాను విడుదల చేయాలి.
- హోల్డ్‌లో ఉంచిన 13 జిల్లాల స్పౌజ్ అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలి.
- వితంతువులు, ఒంటరి మహిళలను స్పెషల్ కేటగిరీలో చేర్చి ఆప్షన్ ప్రకారం రీ అలకేషన్ చేయాలి.
- ఐఎఫ్ఎంఐఎస్ ఎంట్రీలో తప్పిదం/ జాప్యం కారణంగా పాఠశాలల కేటాయింపులో ఆలస్యం జరిగిన ఉపాధ్యాయుల గ్యాప్ పీరియడ్‌ను ఆన్‌డ్యూటీగా పరిగణించి వేతనం చెల్లించాలి.
- వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలు, పదోన్నతుల నిర్వహణకు వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలి.