Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ కోదండరామ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు అంచనాలకు, కేటాయింపులకు పొంతన లేదని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ విమర్శించారు. ప్రభుత్వ నిధుల కేటాయింపులు, వాటి ఖర్చులను అసెంబ్లీ దృష్టికి తీసుకు రాలేదని తెలిపారు. నిరుద్యోగ భృతిని విస్మరించారనీ, విద్యా, వైద్య రంగాలకు కేటాయింపులు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మంగళవారం హైదరాబాద్లోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆ పార్టీ నేతలు ప్రొఫెసర్ పీ.ఎల్. విశ్వేశ్వర్ రావు, జి.వెంకట్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన 2014-15 నుంచి 2019 ఆర్థిక సంవత్సరం వరకు బడ్జెట్ అంచనాలు, వాస్తవాలకు 19 శాతం తేడా ఉన్నదనీ, ఇది మిగతా రాష్ట్రాల్లో కేవలం ఎనిమిది శాతం మాత్రమే ఉన్నదని వివరించారు. రెవెన్యూ ఖర్చులకు కూడా అప్పు తేవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు శాఖ నుంచి రూ. 391 కోట్లు వస్తుందని అంచనా వేశారనీ, ఇక హెల్మెట్ రంగు పోయిందని కూడా పైసలు వసూలు చేసే పరిస్థితి తెచ్చారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు రూ. 19 వేల కోట్లు కేవలం వడ్డీలకే చెల్లించే పరిస్థితి నెలకొన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, వాస్తవ ఖర్చులను బయటపెట్టి, వాటిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. రైతుల ఆత్మహత్యల నివారణ, ధాన్యం సేకరణ అంశాన్ని కూడా ప్రస్తావించలేదని తప్పుపట్టారు. గృహ నిర్మాణ విషయంలో గత ప్రభుత్వాలను నిందించిన సీఎం కేసీఆర్, దానికి కేవలం రూ. మూడు లక్షలు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
బడ్జెట్ కేటాయించిన ప్రతి అంకెలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేననీ, కేటాయింపులపై ప్రతి నెలా లెక్కలు తీస్తామనీ, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. అప్పుల కోసమే కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని ఆరోపించారు. నాన్ ట్యాక్స్ కింద రూ. 25 వేల కోట్లు ప్రతిపాదించారనీ, ఇవి వస్తాయో లేదో గ్యారంటీ లేదనీ, కేంద్రం నుంచి రూ. 41 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారని తెలిపారు. దాదాపు రూ. 60 వేల కోట్లు అప్పు తెస్తున్నారనీ, వీటన్నిటినీ అంచనా వేసి రూ. 2 లక్షల 51 వేల కోట్ల బడ్జెట్ అంచనా వేశారని వివరించారు.