Authorization
Fri March 21, 2025 12:24:11 am
- ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి విక్కీ మహేశ్వరి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగాన్ని పాలకులు సంక్షోభం నెట్టారని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి విక్కీ మహేశ్వరి విమర్శించారు. కార్పొరేట్ అనుకూల విద్యావిధానాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు. దీంతో సమాజంలో విద్యా అసమానతలకు కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీసు బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్దేశించే విద్యారంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించారు. బడ్జెట్లో అరకొర కేటాయింపులే ఇందుకు నిదర్శనమని అన్నారు. కేంద్ర బడ్జెట్లో 2.64 శాతం, రాష్ట్ర బడ్జెట్లో 6.24 శాతం నిధులు కేటాయించడం వల్ల ప్రభుత్వ విద్యారంగం ఎలా బలోపేతం అవుతుందని ప్రశ్నించారు. విద్యారంగాన్ని కార్పొరేట్‌శక్తులకు అప్పజెప్పేందుకే బడ్జెట్లో నిధులు తగ్గిస్తున్నారని విమర్శించారు. శాస్త్రీయ విద్యావిధానం ద్వారా అజ్ఞానం తొలగిపోతుందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్లు యుద్ధం ఆపాలనీ, శాంతిని నెలకొల్పాలని సూచించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్‌స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రావి శివరామకృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆర్ఎన్ శంకర్, ఆఫీసుబేరర్లు డి రాము, పుట్ట లక్ష్మణ్ పాల్గొన్నారు.