Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తమ హక్కుల సాధన కోసం మహిళలు సమరశీలంగా పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. హింస, వివక్ష లేకుండా జీవించే హక్కు కోసం ఉద్యమించాలన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని చెప్పారు. అయినా వివక్ష, అణచివేతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని వాపోయారు. చట్టాల్లో లొసుగుల వల్ల నేరస్తులు తప్పించుకుంటున్నారని చెప్పారు. అందుకే చట్టాలను కఠినతరం చేయాలనీ, నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతోనే మహిళల అభివృద్ధి అయిపోయినట్టు మహిళాబంధు ఉత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సదాలక్ష్మి, రాష్ట్ర సహాయ కార్యదర్శి జె లక్ష్మి, నాయకులు ప్రమీలాదేవి, మాధవి, పర్వీన్, జ్యోతిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.