Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో నామమాత్రపు నిధులే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని హైదరాబాద్ నగర చుట్టుపక్కల ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) స్థల సేకరణ ఈ సంవత్సరం కూడా అయ్యే పనిలా కనిపించడం లేదు. అవసరమైన మేర నిధులు ప్రభుత్వం కేటాయించలేదు. రాష్ట్ర ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్లో కేవలం రూ. 500 కోట్లు కేటాయించింది. అయితే, ఈ నిధులు ఆ ప్రాజెక్టు భూసేకరణకు ఏమాత్రం సరిపోవని రవాణా రంగ నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. 2021-22 రాష్ట్ర బడ్జెట్లో రూ. 750 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు స్థల సేకరణకు 12,500 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా, అందుకు సుమారుగా రూ. 4000 కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్రాథమిక అంచనా. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం 50 శాతం చొప్పున భూసేకరణ కోసం నిధులు భరించాల్సి ఉంటుంది. ఇందులో రూ. 2000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది. కానీ, రెండు సంవత్సరాలు గడవులో కనీసం పూర్తి స్థాయిలో నిధులు సర్కారు కేటాయించలేదు. అందుచేత, ఈ ఏడాది కూడా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు వేగంగా కదలే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఉత్తరం వైపులో ఉన్న 4,500 ఎకరాల్లో 50 శాతం మేర సేకరణ జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే సుమారు రూ. 600 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు అధికారులు అంటున్నారు. ఉత్తరం వైపు పూర్తిగా జరిగి, దక్షిణం వైపు కూడా మొత్తం భూసేకరణ జరగాలంటే మరో ఏడాది పట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. నిధులు పెంచితే కానీ, భూసేకరణ ప్రక్రియ వేగవంతం కాదని అంటున్నవారూ లేకపోలేదు.