Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణిలో ప్రమాదఘటనపై సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణిలోని రామగుండం-3 అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రమాదకానికి కారకులైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. 14 మీటర్ల పొడవున్న బండ కింద చిక్కుకుపోయిన వారిలో ముగ్గురిని ప్రాణాలకు తెగించి కాపాడిన రెస్క్యూటీంకు అభినందనలు తెలిపింది. మిగతా వారినీ కాపాడే చర్యలను వేగిరం చేయాలని యాజమాన్యాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. బొగ్గు తీయడం తప్ప మిగతా పనులన్నీ ప్రయివేటీకరించడం దారుణమని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రయివేటు సంస్థలు కార్మికుల రక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా యజమాన్యం అండర్ గ్రౌండ్ మైన్లలోగానీ, ఓపెన్ కాస్ట్లోగానీ విచ్చలవిడి ప్రయివేటీకరణ విధానాలను మానుకోవాలని సూచించారు. ఈఎల్పీ ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ అగ్రిమెంట్లకు, సూచనలకు వ్యతిరేకంగా యాజమాన్యం వ్యవహరించడం సరిగాదని పేర్కొన్నారు. ఉన్నతస్థాయి అధికారులకు ఉత్పాదకతపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రత మీద లేకపోవడమే దారుణమని విమర్శించారు. గతానుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని సేఫ్టీ సౌకర్యాల విషయంలోప్రయివేటువారికి వదిలేయకుండా సింగరేణి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని కోరారు.