Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి మొండిచెయ్యి చూపించిందని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 2.56 లక్షల కోట్ల బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి కేవలం రూ.1,728 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సుధీర్ కమిషన్ నివేదిక సిఫార్సులను సర్కారే అమలు చేయడం లేదని విమర్శించారు. అంచనాలను సవరించి రూ. 5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. మైనారిటీ సంక్షేమానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు పెంచలేదని తెలిపారు. విద్యార్థుల ఉపకార వేతనాలకు రూ.7కోట్ల కోత విధించారని పేర్కొన్నారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలకు కేటాయింపులు పెంచలేదని తెలిపారు. లక్షలాది మంది యువతీ, యువకులు, చిరు వ్యాపారులు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాల కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మల్టీ సెక్టోరల్ అభివృద్ధి ఫండ్‌కు కోత విధించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలకు మాటలు చెబుతూ బడ్జెట్ కేటాయింపుల్లో తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మైనారిటీ బంధు పథకం ప్రకటించాలని డిమాండ్ చేశారు.