Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్త్రీ లేకపోతే సృష్టే లేదు : మేయర్ విజయలక్ష్మి
- జీహెచ్ఎంసీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు
- పారిశుధ్య కార్మికులతో సహపంక్తి భోజనాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆధునిక కాలంలో కుటుంబ, ఉద్యోగ బాధ్యతలను మహిళలు ఎంతో సహనంతో నిర్వహిస్తున్నారనీ, మహిళలు ఆది పరాశక్తులననీ, స్త్రీ లేకపోతే సృష్టే లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఏండేండ్ల కిందట ఉన్న మహిళలు నేటి మహిళల్లో ఎంతో వ్యతాసం ఉందన్నారు. 109వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మేయర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ద్వారా కోవిడ్-19 విపత్తు కాలంలో ఆశా వర్కర్లు, సఫాయి వర్కర్లు విశేష కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. నగరవాసులకు కోవిడ్ కిట్లను సకాలంలో అందించినందున వారి సేవలు మరువలేనిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, న్యూట్రిషన్ కిట్, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఆసరా ఫించన్లు, ఒంటరి మహిళా ఫించన్లు, స్వయం సహాయక బందాలకు రుణాలు, మహిళలకు సర్టిఫికెట్ల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు నిరంతరాయంగా అందించడబడుతున్నాయని తెలిపారు. మహిళలు ఇంటిలో ఉండకుండా సమాజంలోకి వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇంటర్నల్ కంప్లైంట్ సెంటర్ ద్వారా సమాచారం సేకరించి కఠిన శిక్షలను అమలు చేస్తున్నామని తెలిపారు. డిప్యూటి మేయర్ మోతె శ్రీలత మాట్లాడుతూ మహిళలకు సామాజిక సంస్థల్లో ప్రభుత్వం కల్పిస్తున్న 50 శాతం రిజర్వేషన్ను వినియోగించుకోవాలన్నారు. మహిళా సాధికారతపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత మాట్లాడుతూ మహిళా దినోత్సవం న్యూయర్క్ సిటీ నుంచి శ్రామిక మహిళల కోసం ఏర్పాటై నేటి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుతున్నారని గుర్తు చేశారు. స్త్రీ, పురుషుల సమానత్వం పాటించాలన్నారు. స్త్రీలపై చూపుతున్న వివక్షపై మహిళలు ఐకమత్యంగా పోరాడాలన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను మేయర్ సన్మానించి వారితో సహాపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు పౌసమిబసు, శృతిఓజా, విజయలక్ష్మి, యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య, సీఎంఓహెచ్ పద్మజ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.