Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగులు కమలాకర్
- 393 మంది లబ్దిదారులకు 202 యూనిట్ల పంపిణీ
నవతెలంగాణ-కరీంనగర్టౌన్
దేశంలోనే దళితబంధు గొప్ప పథకం అని, నిన్న కూలీలు, డ్రైవర్లుగా పని చేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు 202 యూనిట్లను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్తో కలిసి మంత్రులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లబ్దిదారులకు వాహనాలు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షలు అందజేసిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని కొనియడారు. బడ్జెట్లో రూ.17,800 కోట్లు దళితబంధుకు నిధులు కేటాయించారని తెలిపారు. అన్ని కులాలను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. 393 మంది లబ్దిదారులకు 202 యూనిట్లుగా, 76 హార్వెస్టర్లు, 12 జేసీబీలు, 15 డీసీఎం వ్యాన్లు, 10 ప్యాడి ట్రాన్స్ప్లాంటర్లు, 4 టిప్పర్ లారీలు, 3 మినీ బస్సులు, మహీంద్రా స్కార్పియో, 79 గూడ్స్ వాహనాలను పంపిణీ చేశారు. మొత్తంగా రూ.38 కోట్ల 06 లక్షల 85 వేల 251 (38,06,85,251) విలువ చేసే వాహనాలు అందజేసినట్టు మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.