Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ధర్నా
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ పట్టణంలో జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం, ఉపాధి మార్గాలు చూపించాలంటూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేశారు. భూనిర్వాసితులతో కలిసి నల్లగొండ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి.. అనంతరం కమిషనర్ రమణాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్టణ కార్యదర్శి ఎండి.సలీమ్ మాట్లాడారు. ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా ఇండ్లు, దుకాణాలు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నోటీసులు జారీ చేసి.. నష్టపోతున్న వారికి పరిహారం, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ పట్టణంలో మర్రిగూడ బైపాస్ నుంచి కలెక్టరేట్ వరకు, పానగల్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు రోడ్డు విస్తరణలో ఇరువైపులా వేలాది మంది ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. యజమానుల దగ్గర ఉన్న డాక్యుమెంట్ ప్రకారం 40 ఫీట్ల రోడ్డుగా ఉన్నప్పటికీ 100 ఫీట్ల స్థలం తీసుకుంటూ ఎలాంటి నష్ట పరిహారం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించకుండా కూల్చడానికి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దండంపల్లి సత్తయ్య, సరోజ, భూనిర్వాసితులు మన్నె శంకర్, పాలది కార్తీక్, రాపోలు శ్రీనివాస్, రాపోలు సత్యనారాయణ, జె.అంజయ్య, బోయపల్లి చంద్రమ్మ, జక్కల సాయి, అనిల్, రాము పాల్గొన్నారు.