Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సమాజాభివృద్ధిలో మహిళలకు ప్రాధాన్యత మరువలేనిదని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వారికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అత్యున్నత చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ, సుష్మాస్వరాజ్, లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ వల్లే ఏర్పడిందని గుర్తు చేశారు.మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతారావు ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రేవంత్ మాట్లాడారు. అంతకు ముందు ఆయన భారీ కేక్ కట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వంలో మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట వేసిందనీ, మంత్రివర్గంలో ఆరుగురు మంత్రులకు అవకాశం కల్పించామని తెలిపారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కోసం సోనియా గాంధీ బిల్లు తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నాలను ప్రధాని మోడీ తొక్కి పెట్టారని విమర్శించారు.కేంద్ర, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో మహిళా రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నలుగురు మహిళలకు మంత్రులుగా అవకాశం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, వివిధ జిల్లాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు.