Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమలు చేస్తున్న తెలంగాణ :
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది తెలంగాణ అని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ చొరవతో దేశంలోనే అత్యధిక వేతనాలను రాష్ట్రంలోని అంగన్వాడీలు అందుకుంటున్నారని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 40 మంది మహిళలకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఒక రోజు మాత్రమే జరిగే వేడుకలను టీఆర్ఎస్ సర్కారు మూడు రోజుల పాటు నిర్వహించిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నారని కొనియాడారు. ఆరోగ్యలక్ష్మిని అమలు చేస్తున్నారనీ, రక్తహీనతతో బాధపడుతున్న మహిళల కోసం న్యూట్రిషినల్ కిట్‌ను ప్రవేశపెట్టారని తెలిపారు. అంగన్వాడీలకు ప్రతి నెల ఐదో తేదీలోపు జీతాలందేలా ఆదేశాలు జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఆడపడుచుల ఖాళీ బిందెలతో నీళ్ల కోసం ఇబ్బంది పడకుండా ప్రతి ఇంటికీ నల్లా నీళ్లుస్తున్న అపర భగీరథులు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి పురుషుని విజయం వెనుక ఒక మహిళ ఉన్నట్టే, ప్రతి మహిళ విజయం వెనుక ఒక పురుషుడుంటారని తెలిపారు. హింసకు వ్యతిరేకంగా మహిళలకు అండగా ఉంటామని చెప్పారు.
కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త ఆర్.లక్ష్మిరెడ్డి, మహిళా విభాగం డీఐజీ బి.సుమతి, శిశు విహార్ ఇన్‌ఛార్జి, ఛైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె.సంతోషిభాయి తదితరుల సత్కరించి అవార్డులను అందజేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య దేవరాజన్ స్వాగతం పలికారు. మహిళా ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత, బాలల హక్కుల పరిరక్షణ చైర్మెన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.