Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలసాధన సమితి జిల్లా కన్వీనర్ కంచె శ్రీనివాస్
- ప్రభుత్వ తీరును నిరసిస్తూ జలదీక్ష
నవతెలంగాణ - ఉట్కూర్
రైతులకు ప్రయోజనం చేకూర్చే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని జల సాధన సమితి జిల్లా కన్వీనర్ కంచె శ్రీనివాస్, కో-కన్వీనర్ హెచ్.నరసింహా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండల కేంద్రంలో మొదటి స్టేజ్ లిఫ్ట్ నిర్మించనున్న పెద్ద చెరువు వద్ద మంగళవారం వారు జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014లో ప్రాజెక్టు నిర్మాణం కోసం 69 జీఓను అమలు చేశారన్నారు. నాటి నుంచి నేటి వరకు ఎలాంటి పనులూ చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. నారాయణపేట జిల్లా అభివృద్ధి చెందాలంటే జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది ద్వారా జూరాల ప్రాజెక్టుకు 7 టీఎంసీల నికర జలాలను తరలించడం ద్వారానే సాధ్యమౌతుం దన్నారు. దక్షిణ తెలంగాణలో సాగు, తాగునీటి సమస్యలున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే, ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టుల ద్వారా నీటిని తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నారాయణపేట జిల్లా రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ఈ పథకాన్ని వెంటనే చేపట్టాలని, లేకుంటే రైతులను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు యఘ్నేశ్వర్ రెడ్డి, బీజేపీ మండల కార్యదర్శి చిన్న నర్సింహ, రైతులు పాల్గొన్నారు.