Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా సీనియర్ నాయకులు హైమావతి
- నవతెలంగాణ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మనువాద, ఆధిపత్య భావజాలమే మహిళల హక్కులను కాలరాస్తోందని, వీటికి వ్యతిరేకంగా పోరాడాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.హైమావతి అన్నారు. హైదరాబాద్లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయంలో జెండావిష్కరణ చేశారు. అనంతరం జనరల్ డెస్క్ ఇన్చార్జి లలిత అధ్యక్షతన మంగళవారం జరిగిన కార్యక్రమంలో హైమావతి మాట్లాడారు. జాతీయోత్పత్తిలో మహిళల వాటా 65శాతం ఉందని, కానీ మహిళలకు సరైన గుర్తింపులేదన్నారు. మహిళలపై లైంగికదాడులు, హింస పెరుగుతుందని, వీటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. ప్రపంచంలో కమ్యూనిస్టు ప్రణాళిక ఆధారంగా మహిళలు తమ హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారని చెప్పారు. అందులో భాగంగానే 1910లో మార్చి 8ను మహిళల హక్కుల దినంగా ప్రకటించారన్నారు. ఐక్యరాజ్యసమితి 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆమోదించింద న్నారు. తర్వాత పనిగంటలు, వేతనాలు, పని ప్రదేశాల్లో వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారని గుర్తుచేశారు. 1936లో ఐద్వా ఏర్పడిందని, స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఉన్న నిర్బంధంలోనూ మోటూరు ఉదయం మహిళలను చైతన్యం చేసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించారన్నా రు. ఐద్వా పోరాటాల ద్వారా తెరపైకొచ్చిన భర్త ఆస్తిలో భార్యకు హక్కు, పుట్టింటి ఆస్తిలో మహిళలకు వాటా కావాలని ఎన్టీఆర్ ప్రభుత్వం అమలు చేసిందని గుర్తుచేశారు. అయినా మహిళలు మంత్రులుగా ఉన్నా, ఇతర కీలకపదవుల్లో ఉన్నా స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారని, భర్తలే పెత్తనం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలందరికీ పని కల్పించడంతోపాటు పురుషుల తో సమానంగా వేతనం ఇవ్వాలని, 33శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, హింసను అరికట్టా లని డిమాండ్ చేశారు. నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్ మాట్లాడుతూ.. నాటి నుంచి నేటి వరకు పరిశ్రమల్లో మహిళలకు తక్కువ వేతనాలే ఇస్తున్నారని అన్నారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు వెట్టిచాకిరీ చేస్తున్నారని చెప్పారు. మనువాద భావజాలమే మహిళల అభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. అనంతరం జర్నలిస్టు సలీమ ధన్యవాదాలు తెలిపారు.