Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్‌పై ఎక్కడైనా చర్చకు సిద్ధం
- ప్రశ్నిస్తాననే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు
- మద్యం, గంజాయితో యువశక్తి నిర్వీర్యం : ఈటల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎన్ని ప్రయత్నాలు చేసినా బడ్జెట్లో రాబడి 1.90 లక్షలు దాటట్లేదు..మిగతా రూ.60 వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తావ్? అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలు..కేంద్రంపై నిందలు..అంకెల గారడీలు తప్ప ఏవీ లేవని విమర్శించారు. పద్దుపై హరీశ్‌రావుతో ఎక్కడైనా చర్చించేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్లోని లొసుగులు బయటపెడతానన్న భయంతోనే అసెంబ్లీ నుంచి తనను సస్పెండ్ చేశారని విమర్శించారు. బడ్జెట్ రూపకల్పనలో హరీశ్‌రావుకు సంబంధం ఉందా? అని ప్రశ్నించారు.
గతంలో బడ్జెట్ రూపొందించేందుకు ఆయా శాఖల అధికారులు, మంత్రులు కలిసి కసరత్తు చేసేవారనీ, ఆ పద్ధతికి కేసీఆర్ మంగళం పాడారని విమర్శించారు. నిటిఅయోగ్, కేంద్రం ఇవ్వబోమని గతంలోనే తేల్చిచెప్పిన రూ.25 వేల కోట్ల నిధులను కూడా ప్రస్తుత బడ్జెట్లో ఆదాయం కింద చూపెట్టడం దారుణమని పేర్కొన్నారు. ఎఫ్ఆర్బీఎమ్ చట్టం అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉంటుందనీ, రాష్ట్రాలు 3 నుంచి 5 శాతం అధిక రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించిందని గుర్తుచేశారు. భూముల అమ్మకాల ద్వారా రూ.15వేల కోట్లు ఆదాయం వస్తుందని చెప్పటం చేతగానితనమేనని విమర్శించారు. బడ్జెట్ సమావేశాలను ఐదారురోజులకు పరిమితం చేయాలని చూడటం దారుణమన్నారు. దళితబంధు ఒక బోగస్ అనీ, రూ.10 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వకుండా ఎంతో కొంత ఇచ్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉందని ఆరోపించారు. గురుకుల పాఠశాలలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయనీ, పిల్లలు పడుకోవడం, తినటం, చదవుకోవడం ఒకే రూములో జరుగుతున్న దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. ప్రతి గ్రామంలోనూ పదుల సంఖ్యలో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యం ద్వారా రూ.37 వేల కోట్ల ఆదాయం రాబట్టుకోవడం దారుణమన్నారు. ఉత్పత్తిలో పాలుపంచుకోనియకుండా మద్యం, గంజాయి మత్తులో ముంచుతూ యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు.