Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా దినోత్సవం రోజు టీచర్ల నిరసన
- విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ భార్యాభర్తలను కలపాలని ప్రభుత్వాన్ని పలువురు బాధిత టీచర్లు కోరారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఉపాధ్యాయ దంపతులను కలపాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. రాష్ట్రంలోని 19 జిల్లాలకు ఒక న్యాయం, 13 జిల్లాలకు మరో న్యాయమా?అని ప్రశ్నించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తుండటం వల్ల పిల్లల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. 317 జీవో ప్రకారం భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా 1655 మెమోను జారీ చేసిందని గుర్తు చేశారు. ఫలితంగా అర్హులైన ఉపాధ్యాయులందరూ దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. అయితే అధికారులు 19 జిల్లాల్లో భార్యాభర్తలను ఒకే జిల్లాకు కేటాయించి, 13 జిల్లాలను విస్మరించారని విమర్శించారు. ఇంకా 2,500 మంది స్పౌజ్ బాధితులున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి 13 జిల్లాల వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కె ఆచారి, ఎస్ నరేష్, జైపాల్‌రెడ్డి, త్రివేణి, మమత, సుజాత, రమాదేవి, అరుణాదేవితోపాటు వందల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.