Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో ఎంబీసీ, బీసీలకు తగ్గిన కేటాయింపులు
- కార్పొరేషన్లు, ఫెడరేషన్ల ఊసేలేని వైనం
- గురుకుల సొంత భవనాలకు నిధులు నిల్
- గిరిజనులకు మొండి చేయి
- దళిత బంధు లక్ష్యం నెరవెరేనా?
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని రాష్ట్ర సార్కారు ప్రస్తుత బడ్జెట్లో అంతగా పట్టించుకోలేదు. మొక్కుబడిగా ఎదో ఇచ్చినట్టు చేసి మమా అనిపిచ్చింది. చేతి వృత్తుల వారి సంక్షేమం కోసం అరకొరగానే నిధులు విదిల్చింది. కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు భారీగా ఉంటాయని ఆశిస్తే నిరాశే మిగిలింది. గత ఎన్నికల సమయంలో స్వయం గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా అలాగే ఉన్నాయి. మొత్తానికి బడ్జెట్‌పై పాత పాటే కొత్తగా పాడారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంకెలు పెంచారు..కార్పొరేషన్లను విస్మరించారు..
రాష్ట్ర బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు రూ. 5,697 కోట్ల నిధులు కేటాయించారు. గతేడాది రూ.5,522 కోట్లు కేటాయించింది. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు రూ. 500 కోట్ల చొప్పున వెయ్యి కోట్లు కేటాయించగా, అందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. లోన్ల కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించినా సర్కారు ఆమోదించలేదు. కుల వృత్తులకు శిక్షణ ఇవ్వలేదు. ఈ సారి కూడా బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు చెరో రూ.300 కోట్ల చొప్పున రూ.600 కోట్లు కేటాయించారు. నాలుగేండ్లుగా బీసీ ఫెడరేషన్లకు ఒక్క పైసా కేటాయించలేదు. దీంతో ఆ ఫెడరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. మరో పక్క అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమానికి తగిన ప్రణాళిక లేదు. వారి అభివృద్ధికి గతంలో వెయ్యి కోట్లు కేటాయిస్తామని పెద్ద ఎత్తున మాటలు చెప్పారు. తాజా బడ్జెట్లో ఒక్కో కార్పొరేషన్‌కు రూ.300 కోట్లు చొప్పున ప్రకటించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.400 కోట్లు కోతపడింది. ఫెడరేషన్లకు గత బడ్జెట్లో రిక్త హస్తం చూపినా తాజా బడ్జెట్లో 12 ఫెడరేషన్లకు సింగిల్ డిజిట్లో నిధులు కేటాయించింది.
మాట తప్పిన సర్కారు..
బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే సమగ్ర విధానం రూపొందిస్తామని సర్కార్ వారికి గతంలో మాటిచ్చింది. ప్రస్తుతం బీసీ విధానం ప్రస్తావన బడ్జెట్లో లేకపోవటం గమనార్హం. 2017 డిసెంబర్లో గొప్పలు చెబుతూ అసెంబ్లీలో బీసీ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశాల ఎజెండా బుట్టదాఖలైంది. చర్చలు, సమావేశాలు జరిపి ఏకగ్రీవంగా ఆమోదించిన 210 తీర్మానాలు అటకెక్కాయి. నాలుగేండ్లవుతున్నా ఈ తీర్మానాల అమలుకు నోచుకోవటం లేదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లాగానే బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీ ఈ సారికూడా అటకెక్కించింది.
మైనార్టీలకు మొండి చెయ్యి..
మైనార్టీల సంక్షేమానికి మొండి చెయ్యి చూపించింది. 2లక్షల 56వేల కోట్ల బడ్జెట్లో కేవలం రూ.1,728 కోట్లు మాత్రమే కేటాయించారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సుధీర్ కమిషన్ నివేదిక సిఫారసులకు భిన్నమైన కేటాయింపులు జరిగాయి. మైనార్టీ విద్యార్థుల ఉపకార వేతనాలకు ఏడు కోట్లు రూపాయలు కోతలు విధించారు. దీంతో పేద విద్యార్థులకు తీరని నష్ట జరుగనున్నది. మరో పక్క లక్షమంది యువతీ, యువకులు చిరు వ్యాపారులు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కార్పొరేషన్‌కు తగిన నిధులు కేటాయించలేదు.
గొర్రెల పంపిణీ..
గొర్రెల పెంపకం దారులు రాష్ట్రంలో సుమారు 7.30 లక్షల మంది ఉన్నారు. వీరిలో 3.80లక్షలమందికి మాత్రమే గొర్రెలు పంపిణీ చేశారు. ఇంకా 3.51 లక్షల మందికి ఇవ్వాల్సింది ఉంది. అందరికీ లబ్ది చేకూరాలంటే..సుమారు ఆరు వేల కోట్లు అవసరమవుతాయి. కానీ..బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది వెయ్యి కోట్లు మాత్రమే. ఈ నిధులతో అందరికీ లబ్ది చేకూరుస్తామని నమ్మబలకటం గొల్లకుర్మలను మోసం చేయటమే.
అందరికీ దళిత బంధు అందేనా..?
బడ్జెట్లో దళిత బంధుకు రూ.17,700కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులతో విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. కానీ..రాష్ట్రంలో ఉన్న 18లక్షల కుటుంబాలకు దళిత బంధు దక్కాలంటే..ఏండ్లకేండ్లు పట్టే అవకాశం ఉంది. ఈ కేటాయింపులతో లక్ష్యం చేరుకోవటం ఆచరణలో ఎండమావులను చూడటమేనన్న విమర్శలున్నాయి. గడిచిన ఏడేండ్లలో రూ.86వేల కోట్లు ఎస్సీ ప్రత్యేక అభివృద్ధికింద కేటాయింపులు జరిగాయి. కానీ..రూ. 55వేల కోట్లు మాత్రమే ఖర్చు చూపించారు. మిగిలిన నిధులను ఈ వార్షిక బడ్జెట్లో కలపాలన్న నిబంధనను అమలు చేసేందుకు చిత్త శుద్ధి చూపాలి.
గిరిజనులకు నామమాత్రపు నిధులే..
గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధికి 30 ప్రభుత్వ శాఖలు రూ.17వేల కోట్లకు పైగా కేటాయించాల్సి ఉంది. కానీ..12,565 కోట్లు మాత్రమే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. గిరిజనుల్లో నిరుద్యోగం ఉపాధి వంటి సమస్యలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో యువతీ, యువకులకు స్వయం ఉపాధికి రుణాలిచ్చే ట్రైకార్ వంటి సంస్థలకు అధిక నిధులు కేటాయించాలి. కానీ..నామమాత్రపు నిధులతో సరిపుచ్చింది.