Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వరంగ బీమా కంపెనీలను ప్రయివేటీకరించొద్దు
- హెచ్ఆర్జీఐఈఏ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే పార్లమెంట్లో పాస్ చేయాలని హైదరాబాద్ రీజినల్ జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(హెచ్ఆర్జీఐఈఏ) ప్రధాన కార్యదర్శి వై.సుబ్బారావు, ఏఐఐఈఏ ఉపాధ్యక్షులు కేవీవీఎస్ఎన్ రాజు, ఐద్వా నేత కె.నాగలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని నేషనల్ ఇన్సూరెన్స్ సికింద్రాబాద్ డీఓ-1లో హెచ్ఆర్జీఐఈఏ మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళా సదస్సును నిర్వహించారు. హెచ్ఆర్జీఐఈఏ సహాయ కార్యదర్శి ఎ.అనురాధ, మహిళా కన్వీనర్ ఎం.శ్రీదేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలను కించపరుస్తూ తీస్తున్న సినిమాలు, సీరియళ్లతో సమాజం పెడదోవన పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మహిళల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వివరించారు. ఆర్థికంగా బలంగా ఉన్న ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలను ప్రయివేటీకరించే చర్యలకు మోడీ సర్కారు పూనుకుంటున్నదని విమర్శించారు. బీమా రంగ సంస్థల్లో ఉద్యోగుల వేతన సవరణను చేయడం లేదన్నారు. వేతనసవరణ, ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.