Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అమీన్ పూర్
మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని, పారిశ్రామిక రంగంలోనే మహిళా పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సాహం అందించ డానికి మహిళా పారిశ్రామికవాడలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఫిక్కీ అనుబంధంతో 50 ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్న మహిళా పారిశ్రామిక పార్క్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం మహిళలకు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. పరిశ్రమలు స్థాపించే మహిళలకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. నందిగామ, గాజుల రామారాం, తూప్రాన్ వంటి చోట్ల మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కుల్లో స్థలాలు కేటాయించామని తెలిపారు. మహిళల కోసం వీహబ్ ఏర్పాటు చేసినట్టు మంత్రి పునరుద్ఘాటించారు. పారిశ్రామికంగా రాష్ట్రం ఎంతో వృద్ధి చెందుతోందని, ఇదంతా దేశంలో ఎక్కడాలేనటువంటి టీఎస్ ఐపాస్ వంటి కార్యక్రమాలు సీఎం కేసీఆర్ తీసుకురావడం తోనే సాధ్యమైందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 18 వేల దరఖాస్తులు క్లియరయ్యా యని, 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో పరిశ్రమలు రాగా 1.6 బిలియన్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినట్టు తెలిపారు. 2014లో ప్రత్యేక రాష్ట్రం తెలంగాణలో జీఎస్ డీపీ రూ.4.9 లక్షల కోట్లు ఉండేదని, ఏడేండ్ల తర్వాత ఇప్పుడు రూ. 18.54 లక్షల కోట్లకు అంటే 120 శాతం వృద్ధి చెందిందన్నారు. 2014లో క్యాపిటల్ ఇన్కమ్ రూ.1.24 లక్షలుగా ఉండగా ఇప్పుడు రూ.2.78 లక్షలకు చేరిందని చెప్పారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ.. కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ కంటే ముందు వరుసలో ఉండటానికి సీఎం కేసీఆర్ అద్భతమైన పాలనే కారణమని తెలిపారు.
వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్‌గా హైదరాబాద్
ప్రపంచం మొత్తానికి సరఫరా అయ్యే వ్యాక్సిన్లలో 35 శాతం హైదరాబాద్‌లో తయారు కావడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని దేశాలకు ఇక్కడి నుంచే వ్యాక్సిన్లు సరఫరా చేసినట్టు గుర్తుచేశారు. ఫార్మాసుటికల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ గుర్తింపు పొందిందన్నారు. సింగిల్ విండో సిస్టమ్ తీసుకురావడంతోనే పరిశ్రమలకు అనుమతులు సులభంగా వస్తున్నా యని, ఈ క్రమంలోనే పరిశ్రమల స్థాపనకు పారిశ్రా మిక వేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారని తెలి పారు. హెల్త్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎయిరోస్పెస్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.