Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిర్చికి రూ.40,000, పత్తికి రూ.10,100/-
నవతెలంగాణ-కాశిబుగ్గ
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చికి రికార్డు ధరలు పలికాయి. మార్కెట్ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా సింగిల్ పట్టి మిర్చికి క్వింటాకు రూ.40,000, పత్తికి రూ.10,100 పలికింది, ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు సుధాకర్ రావు 11బస్తాల సింగిల్ పట్టి మిర్చి తీసుకురాగా శ్రీశ్రీ ఎంటర్ప్రైజెస్ ఆడ్తి ద్వారా రాజరాజేశ్వరి చిల్లీస్ ఖరీదుదారు అత్యధిక ధర రూ.40 వేలు పెట్టి కొనుగోలు చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి / ఆరెపల్లి గ్రామానికి చెందిన రైతు తిరుపతి.. 17బస్తాల పత్తి తీసుకురాగా జాజు ట్రేడర్స్ ఆడ్తి ద్వారా విశ్వనాధ ట్రేడింగ్ కంపెనీ ఖరీదుదారు అత్యధిక ధర రూ.10,100 పెట్టి కొనుగోలు చేశారు. కాగా వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు మంగళవారం.. పత్తి 35 వేల బస్తాలు రాగా గరిష్ట ధర రూ.10,100, కనిష్ట ధర రూ.9000 మధ్య ఉంది. మిర్చి తేజాలు 6వేల బస్తాలు రాగా గరిష్ట ధర 18,300, కనిష్ట ధర 13,300, వండర్ హాట్ 2,500 బస్తాలు రాగా ధర గరిష్టం రూ.23,000, కనిష్టం రూ.16,000 ధర పలికింది. సింగిల్ పట్టి 100 బస్తాలు రాగా ధర గరిష్టం రూ. 40,000, కనిష్టంగా 22,000 మధ్య ఉంది. మార్కెట్ చరిత్రలో మొదటిసారి అత్యధిక ధర పొందిన రైతులు సుధాకర్‌రావు, తిరుపతిని మార్కెట్ కమిటీ చైర్మెన్ దిడ్డి భాగ్యలక్ష్మి, జేడీఎం మల్లేశం, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రసాద్‌రావు, మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి బివి రాహుల్ శాలువాలతో సత్కరించారు. అలాగే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు మహిళా రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ అధికారులు తోట చందర్ రావు, బియాబాని, జన్ను భాస్కర్, లా షరీఫ్, నర్సింహ, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.