Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఆత్మహత్యల నివారించాలి :తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతు ఆత్మహత్యలను నివారించేలా వ్యవసాయరంగానికి రూ 50వేల కోట్లకు బడ్జెట్‌ను పెంచాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఆ రంగానికి రూ.24,254 కోట్లు కేటాయించినట్టు ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారని పేర్కొంది. వ్యవసాయం, సహకారం, ఉద్యాన, సెరి కల్చర్‌తోపాటు వర్షభావ పరిస్థతుల శాఖలు ఒకే గొడుగు కింద ఉంటాయనీ, ప్రత్యేకంగా వ్యవసాయానికి రూ.18,941.71 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారని తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి సాగర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతేడాది ప్రగతి పద్దు, నిర్వహణ పద్దు కలిపి రూ.18,494.85 కోట్లు కేటాయింపులు చేశారనీ, ఈసారి వాస్తవ కేటాయింపు రూ.17,829.54 కోట్లు మాత్రమే చూపారని పేర్కొన్నారు. బడ్జెట్ ప్రకటనకు, గ్రాంట్ నివేదికలోని అంకెలకు వ్యత్యాసం ఉందని తెలిపారు. గతేడాది బడ్జెట్ కంటే ఈసారి రూ.665.31 కోట్లు తగ్గించిందని విమర్శించారు. రుణమాఫీకి రూ.2,939 కోట్లు, రైతుబంధుకు రూ.11,415 కోట్లు, రైతుబీమా రూ.1077 కోట్లు, మార్కెట్ జోక్యం కింద రూ 75 కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. ఇవి మినహాయిస్తే వ్యవసాయానికి కేటాయింపులు లేనట్టేనని పేర్కొన్నారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, విత్తన సబ్సిడీ, ఆహార భద్రత, యాంత్రీకరణ సబ్సిడీ, నూనె గింజల ఉత్పత్తి, భూసార కార్డులు, ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి కేటాయింపులే చేయలేదన్నారు. 2021-22లో తుఫాన్ల వల్ల 8.5 లక్షల ఎకరాల పంటలకు నష్టం వాటిల్లిందనీ, దానికి తోడు రాళ్ళ వాన వల్ల రూ.1200 కోట్ల నష్టం జరిగిందని గుర్తు చేశారు. మొత్తం రూ.6,200 కోట్ల నష్టం జరిగినా వాటికి కేటాయింపులు చేయకపోవడమేంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 2020 వరకు అత్యంత కరువు పరిస్థితులు తాండవించాయని గుర్తు చేశారు. వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రకటించిన సర్కారు...బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. రైతు బీమాకు 18 నుంచి 75 వయో పరిమితి సంవత్సరాలకు పెంచాలంటూ రైతు సంఘాలు విజ్ఞప్తిచేసినా అందుకగుణంగా బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం సరైందికాదని తెలిపారు. ధరణి వెబ్ సైట్లో గుర్తించిన 20 లోపాల గురించి మంత్రి ప్రస్తావించకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. 2014 నుంచి 2020 వరకు వ్యవసాయ రంగానికి రూ.57,223 కోట్లు కేటాయించి, రూ.42,051 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయని గుర్తు చేశారు. ప్రధాని ఫసల్‌బీమా నుంచి బయటకు వచ్చిన రాష్ట్రం రైతులకు ప్రత్యామ్నాయ పంటలభీమాను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ బడ్జెట్‌ను రూ.50వేల కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు.