Authorization
Thu March 13, 2025 02:41:14 am
- రెస్క్యూ సిబ్బంది కృషితో ఉద్యోగి రవీందర్ క్షేమం
- హైదరాబాద్ ఆస్పత్రికి తరలింపు
- మరో ముగ్గురి కోసం గాలింపు
- గనిపై కుటుంబీకుల పడిగాపులు
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
సింగరేణి రామగుండం -3 ఏరియాలో బొగ్గు పెళ్లల కింద చిక్కుకున్న వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. సింగరేణి రెస్క్యూ సిబ్బంది సాహసోపేతమైన పనితీరుతో ఆర్జీ-3 పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ గనిలో నుంచి ఉద్యోగి రవీందర్‌ను మంగళవారం మధ్యాహ్నం సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగతా ముగ్గురి కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. గనిలో రక్షణ పనులు నిర్వహిస్తున్న ఉద్యోగులపై సోమవారం బొగ్గు పరదాలు కూలిన విషయం తెలిసిందే. దాదాపు 24 గంటలుగా రెస్క్యూ సిబ్బంది పని చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ పనులు చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో మైనింగ్ సూపర్వైజర్ నరేష్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో 'రక్షించండి.. నేను క్షేమంగా ఉన్నాను' అంటూ రవీందర్ పలికిన మాటలను రెస్క్యూ సిబ్బంది విన్నారు. అప్రమత్తమైన అధికారులు బొగ్గు పరదాల తొలగింపు ప్రక్రియను మరింత జాగ్రత్తగా కొనసాగించారు. వీరి ప్రయత్నాలు ఫలించి రవీందర్ ఆచూకీ కనుగొన్నారు. ఆయనకు మంచినీళ్లు అందించి ధైర్యాన్ని కల్పించారు. రవీందర్ నడుము భాగం వరకు బొగ్గు కుప్పలో పూర్తిగా కూరుకుపోయారు. ఆయనను రక్షించడానికి ఒక దశలో బొగ్గు కుప్పల నుంచి పైకి లాగే ప్రయత్నం చేశారు. అయితే, రవీందర్ ఆ బాధను తట్టుకోలేకపోవడంతో రెస్క్యూ సిబ్బంది వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. బొగ్గు పెళ్లలను తొలగించే పని సురక్షితంగా, వేగంగా నిర్వహించడం వల్ల సాయంత్రం నాలుగు గంటల సమయంలో సురక్షితంగా పైకి తీసుకురాగలిగారు. వెంటనే అంబులెన్స్ ద్వారా గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎక్స్ రే, సిటీ స్కాన్, ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. తొడలకు, కాళ్లకు, వెన్నెముకకు గాయాలైనట్టు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సింగరేణి డైరెక్టర్ 'పా' బలరాం, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎస్.చంద్రశేఖర్, కార్మిక సంఘాల నాయకులు తుమ్మల రాజిరెడ్డి, కొమురయ్య, సీతారామయ్య, వైవి.రావు, జూపాక రాము, మిరియాల రాజిరెడ్డి, గౌతమ్ శంకరయ్య, నూనె కొమురయ్య, రియాజ్ అహ్మద్, అరకాల ప్రసాద్ తదితరులు లోనికి వెళ్లి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. సింగరేణి ఉన్నతాధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు వీరితో గుర్తింపు సంఘం నాయకులు వెంకట్రావు, రాజిరెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమాదంలో ఇప్పటికీ చిక్కుకుని ఉన్న ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జయరాజు, గని అసిస్టెంట్ మేనేజర్ సూర్య తేజ, కాంట్రాక్టు కార్మికుడు శ్రీకాంత్ కోసం ముమ్మరంగా బొగ్గు తొలగింపు పనులు చేస్తున్నారు.
గనిపై కుటుంబీకుల పడిగాపులు
గని ప్రమాదంలో చిక్కుకుపోయిన ఉద్యోగుల కోసం కుటుంబీకులు పడిగాపులు కాస్తున్నారు. తమ వారి కోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన నాయకుల ముందు కన్నీరు పెడుతూ తమ కుటుంబీకులను సురక్షితంగా తీసుకురావాలని వేడుకుంటుండగా.. తోటి కార్మికులూ కంటతడి పెట్టుకుంటున్నారు.