Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమానవేతనం చెల్లించాలి
- హింసలేని సమాజం కావాలి
- స్త్రీల రక్షణ బాధ్యత పాలకులదే
- 28,29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: సీఐటీయూ
- ఐద్వా,టీఎస్‌యూటీఎఫ్ సభలో పుణ్యవతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహిళలకు పనిహక్కు కల్పించాలని ప్రభుత్వాలను శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఉమ్మడి రాష్ట్ర కన్వీనర్, ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్ పుణ్యవతి డిమాండ్ చేశారు. పురుషులతో సమానంగా వేతనం చెల్లించాలని కోరారు. హింసలేని సమాజం కావాలన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఐటీయూ, ఐద్వా, టీఎస్‌యూటీఎఫ్
రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో 'యాక్షన్డే' నిర్వహించాయి. అందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని వీఎస్టీ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కళానిలయంలో జరిగిన సభకు అధ్యక్షవర్గంగా శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమ, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, టీఎస్‌యూటీఎఫ్ మహిళా విభాగం కన్వీనర్ దుర్గాభవాని వ్యవహరించారు. ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ సమాజంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రామిక మహిళలకు కనీసవేతనం చెల్లించాలనీ,సమాన వేతనం ఇవ్వాలని కోరారు.ఆడపిల్లలకు చదువు కావాలనుకుం టున్నారా?,వద్దనుకుంటున్నారా?అనిపాలకులను ప్రశ్నించారు. ఉపాధ్యాయుల్లేకుంటే పాఠా లు ఎవరు చెప్తారని నిలదీశారు. 'బేటీ బచావో బేటీ పడావో'అంటున్న మోడీ ఆడపిల్లల విద్యకు నిధులు మాత్రం కేటాయించడం లేదని విమర్శించారు. అంటే మనుధర్మం ప్రకారం చదువుకోకుండా చిన్నవయస్సులో పెండ్లి చేసుకోవాలంటారా?అని మోడీని నిలదీశారు. పాలకులకు నిజాయితీ ఉంటే మహిళలకు ఉపాధి కల్పించాలనీ, కనీస వేతనం ఇవ్వాలనీ, పురుషులతో సమానంగా వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. స్త్రీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పాలకులదేనని నొక్కి చెప్పారు. సమాజంలో హింసను అరికట్టాలని కోరారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం లేబర్కోడ్లను తెచ్చి హక్కులను హరిస్తున్నదని విమర్శించారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాను అదానీకి అప్పగించే కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఎల్ఐసీ, బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తే ప్రజలే నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 28,29 తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
బడుల్లేక అమ్మాయిలకు బాల్యవివాహాలు : సంయుక్త
సమాజంలో అసమానతలు, వివక్ష, అనారోగ్యం, రక్షణలేనితనం, అఘాయిత్యాలను చూసి మహిళా దినోత్సవ వేడుకలను చేసుకోవాలా?అని ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సంయుక్త ప్రశ్నించారు. పురుషునితోపాటు మహిళ సమానమని అన్నారు. ఇంటి నుంచే వివక్ష ఉందనీ, మార్పు రావాలని ఆకాంక్షించారు. కోవిడ్ నేపథ్యంలో బడుల్లేక, చదువుల్లేక అమ్మాయిలకు బాల్యవివాహాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాబు, పాప అన్న తేడాలేకుండా పిల్లలను పెంచాలని సూచించారు. సమిష్టి పోరాటాలే విజయంసాధిస్తాయనీ, హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చా రు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు మాట్లాడుతూ అమృత మహోత్స వాలు జరుగుతున్న ఈ దేశంలో ఇంకా మహిళ లు రక్తహీనత, పౌష్టికాహార లేమితో ఇబ్బంది పడుతున్నందుకు పాలకులు సిగ్గుపడాలన్నారు. మహిళల శ్రమను గుర్తించాలనీ, ఇంటి పనినీ గౌరవించాలని కోరారు. గోదాముల్లో ఆహారధాన్యాలున్నా సమాజంలో ఆకలి ఎందుకుందని ప్రశ్నించారు. ఈనెల 28,29 తేదీల్లో జరిగే దేశభక్తియుత సమ్మెలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. డాక్టర్ సంధ్యాదీక్షిత్ మాట్లాడుతూ కుటుంబం, సమాజం బాగుండాలంటే మహిళల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. యుక్త వయస్సు అమ్మాయిలు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. లేదంటే వారి ఎదుగుదలతోపాటు పుట్టే బిడ్డలపైనా ప్రభావం చూపుతున్నదన్నారు.పేద, దిగువమధ్యతరగతి తోపాటు అమ్మాయిలకు విద్యను దూరం చేసేందుకే నూతన విద్యావిధానాన్ని కేంద్రం తెచ్చిందని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య విమర్శించారు. కరోనా నేపథ్యంలో సర్కారు బడుల్లో చదివే విద్యార్థులు బాలకార్మికులుగా మారి విద్యకు దూరమయ్యా రని ఆందోళన వ్యక్తం చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో మహిళా సంక్షేమానికి కోత విధించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌తోపాటు ఆర్ వాణి, వినోద, శశికళ, మీనా (సీఐటీయూ), బి హైమావతి (ఐద్వా), శారద, సుగంధ, వెంకటరత్నం, వందన (టీఎస్‌యూటీఎఫ్) తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.