Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వార్థం కోసం దేశాన్ని ఆగం పట్టించే కుట్ర
- మత పిచ్చిగాళ్లను బంగాళాఖాతంలో విసిరేయాలి
- బీజేపీ ఆట కట్టించేందుకు జాతీయ రాజకీయాల్లోకి..
- నిరుద్యోగుల కోసం నేడు కీలక ప్రకటన:
- వనపర్తి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
'దేశంలో గోల్ మాల్ గోవిందం గాళ్లు మోపు అయ్యారు.. ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ తన స్వార్థం కోసం దేశాన్ని చీల్చే కుట్రలకు పాల్పడుతోంది.. ప్రజలకు మత పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. కాషాయమూకలు, నరేంద్రమోడీ .. దుర్మార్గమైన చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. లౌకికతత్వాన్ని మంట కలుపుతున్నారు. ఇలాంటి మత పిచ్చిగాళ్లను బంగాళఖాతంలో విసిరేస్తే పీడ విరుగడవుతుంది. చైతన్యవంతమైన తెలంగాణ మేధావులు.. దయచేసి దాన్ని తిప్పి కొట్టాలి. భయంకరమైనటువంటి ఆ వ్యాధి ఆ క్యాన్సర్ మనకు రాకుండా చూసుకోవాలి.. చైతన్యం ఉన్న గడ్డగా.. తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకం తెలంగాణలో రానివ్వను. కులం, మతం, జాతి లేకుండా ప్రజలంతా బాగుపడాలి' అని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాల మైదానంలో మంగళవారం బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. కుల, మత రాజకీయాలను రెచ్చగొడుతూ దేశమేలుతున్న బీజేపీ పాలకులు రాజకీయాలకు స్వస్తి పలకాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలంతా మతతత్వ పార్టీని ఇంటికి పంపేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేసినట్టుగానే దేశాభివృద్ధి కోసం చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేస్తానన్నారు.
వాల్మీకి గిరిజనుల రిజర్వేషన్స్ పెంచాలని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసినా మోడీ కావాలనే ఆలస్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం రాకముందు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఉండేది కాదని, ప్రస్తుతం ఐదు జిల్లాల్లో ఐదు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో సంపూర్ణ మార్పు తీసుకొచ్చి బంగారు దేశంగా మార్చుతామని దీమా వ్యక్తం చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అర్ధాంతరంగా ఆగిందని, త్వరలోనే అవాంతరాలను అధిగమించి పూర్తి చేసి 16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరుకు 11 జిల్లాల నుంచి వలస వస్తున్నారన్నారు.
హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ధాన్యపు రాసులు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్, ఎంపీలు పోతుగంటి రాములు, మన్యం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మెన్ ఆర్.లోక్‌నాథ్ రెడ్డి, సాయిచందు, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు - మన బడికి శ్రీకారం
అంతకుముందు వనపర్తి జిల్లా వేదికగా మన ఊరు -మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.మన ఊరు - మన బడి పైలాన్‌ను సీఎం కేసీఆర్,మంత్రులు సబితా ఇంద్రారెడ్డి,నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ కలిసి ఆవిష్కరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ తర్వాత వనపర్తి జిల్లా కలెక్టరేట్‌ను సీఎం ప్రారంభించారు. మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు.
నేడు నిరుద్యోగుల కోసం అసెంబ్లీలో ప్రకటన
నిరుద్యోగ యువ సోదరులకు ప్రయోజనం చేకూర్చే విధంగా నేడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. నిరుద్యోగ సోదరులంతా మంగళవారం పొద్దున 10 గంటలకు టీవీలు చూడండి. ఏం ప్రకటన చేయబోతున్నామో చూడండి.. అని సీఎం తెలిపారు.