Authorization
Thu March 13, 2025 02:45:19 am
- అన్ని రాష్ట్రాలూ పాత పింఛన్ పునరుద్ధరించాలి
- ఎన్ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానం (సీపీఎస్)ను చత్తీస్ఘడ్ ప్రభుత్వం రద్దు చేసింది. గతనెలలో రాజస్థాన్ ప్రభుత్వం సైతం సీపీఎస్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాలూ సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పింఛన్ స్కీం (ఎన్ఎంఓపీఎస్) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చత్తీస్ఘఢ్ ముఖ్యమంత్రి భూపేష్భాగేల్ సీపీఎస్ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం 1972 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్‌ను అనుసరించి అమలు చేస్తామని ప్రకటించారని వివరించారు. 2004 తర్వాత అమల్లోకి వచ్చిన సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానంపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ నిర్ణయం తీసుకోవాలని కోరారు. సీపీఎస్ వల్ల ఆర్థిక వనరులు కార్పొరేట్లకు పెట్టుబడిగా వెళ్తున్నాయని తెలిపారు.
ప్రజలకు సుపరిపాలన అందించే ఉద్యోగులకు సామాజిక భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2004 నుంచి తెలంగాణకు చెందిన దాదాపు రూ.ఆరు వేల కోట్లు ఎన్ఎస్డీఎల్ ద్వారా షేర్మార్కెట్లోఇ పెట్టుబడులుగా వెళ్లాయని వివరించారు. పాత పింఛన్ విధానం అమలైతే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వినియోగించుకోవచ్చని సూచించారు.