Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందర్నీ పర్మినెంట్ చేయాలి
- సీఎం కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు 11,103 మంది మాత్రమే కాదు 40 వేలకుపైగా ఉంటారనీ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను స్వాగతిస్తున్నామనీ, అయితే, అందర్నీ పర్మినెంట్ చేయాలని విన్నవించారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేశ్ ఒక లేఖ రాశారు. యాక్ట్ 2 ఆఫ్ 94ను శాసనసభలో రద్దు చేయకుండా కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు కాదని పేర్కొన్నారు. ఈ డిమాండ్‌ను ఫెడరేషన్ అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చినప్పటికీ పరిష్కారం లభించలేదని తెలిపారు.
అసెంబ్లీలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగానే రాష్ట్రంలో మిగిలిన కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగుల అనుభవం, వయస్సు, మహిళా ఉద్యోగులు, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా త్వరలో జరగబోయే ఖాళీల భర్తీ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, డైలీవేజ్, కంటింజెంట్ తదితర ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులు 40,000 మంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 1,50,000 మంది వరకూ ఉన్నారని తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రస్తావనే లేకపోవడం చాలా అన్యాయమని పేర్కొన్నారు.