Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరీశ్ వర్సెస్ రాజగోపాల్
- ఫుల్ నాల్జెజ్తోనే...అగ్బరుద్దీన్ సెటైర్
- క్లారిఫికేషన్‌పై భట్టికి నో చాన్స్
- సాధారణ బడ్జెట్‌పై ముగిసిన రచ్చ
- నేటి నుంచి పద్దులపై చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బడ్జెట్‌పై సాధారణ చర్చలో 'ఆఫ్ నాలెడ్జ్' అనే పదం రచ్చకు దారి తీసింది. సగం తెలివి కావచ్చు...తెలివితక్కువగా మాట్లాడటం కావచ్చు...ఏదైనా సాధారణ బడ్జెట్‌పై చర్చలో ఇతర పక్షాలనుద్దేశించి మంత్రి ఆఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలంరేపాయి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాల ఆపన్నహస్తం అందిస్తున్నదంటూ బీజేపీ సభ్యులు చేస్తున్న కామెంట్లను హరీశ్‌రావు సభావేదికగా తప్పుపట్టారు. బయట ఉండి ఆఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా ఎదురుదాడి చేశారు. ఇదే క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన నిధులను మంత్రి ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 'ఎండిన కంకులు లేవు...లాంతర్లు లేవు..కన్వ్ర్టర్లు, ఇన్వ్ర్టర్లు లేవు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, బీడుబారుతున్న పొలాలు లేవు. బిందెలు, కుండలతో అసెంబ్లీకి వచ్చుడు లేదు. ధర్నాలు, నిరసనలు లేవు' కానీ కాంగ్రెస్ హయాంలో ఇలాంటి సీన్లు లెక్కలేనన్ని ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ఈ దశలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కలుగజేసుకుని ఆఫ్ నాలెడ్జ్‌తోనే హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసిందా? అంటూ నిలదీశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేములు ప్రశాంత్‌రెడ్డి రాయలతెలంగాణకు అంగీకరించిన కాంగ్రెస్ నేతలు...హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ అని చెప్పడం సరైందికాదంటూ తిప్పికొట్టారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆఫ్ నాలెడ్జ్ అంటే మీ మీదెంకుకు ఎందుకు వేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. గుమ్మడికాయల దొంగంటే, భుజాలు తడుముకున్నట్టు ఉంది.. ఆ వ్యాఖ్యలు ఎవరికి తగులాలో వారికి తగిలాయి అంటూ రాజగోపాల్‌రెడ్డిని శాంత పరిచే ప్రయత్నం చేశారు. రాజగోపాల్ మాత్రం పదే పదే కాంగ్రెస్‌ను అంటుంటే, మనసుకు బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు బడ్జెట్‌పై చర్చలో ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ మైనార్టీ బడ్జెట్‌కు కేటాయింపులు పుస్తకంలో సంఖ్య ఒకలా, ఇంకో పుస్తకంలో మరోలా ఉందని వివరాలు చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీముబాక్ పథకాలకు నిధుల కొరత లేదనీ, అందుకు గ్రీన్‌చానల్ కూడా ఏర్పాటు చేశామని మంత్రి సభకు వివరించారు. షాదీముబారక్ గ్రీన్ చానల్లో లేదంటూ అక్బరుద్దీన్ చెప్పారు. షాదీముబారక్ గ్రీన్‌చానల్ ఉందని హరీశ్‌రావు, లేదంటూ అగ్బరుద్దీన్ మధ్య వాగ్వాదం జరిగింది.గ్రీన్‌చానల్‌లో అది లేకపోయినా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఆరోగ్యశ్రీకార్డు లేకున్నా...తెల్లరేషన్‌కార్డు ఉన్నా అన్ని ఆస్పత్రుల్లోనూ ఆ పథకం వర్తిస్తుందంటూ తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న అప్పులన్ని ప్రజాసంక్షేమం కోసమేనంటూ మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌పై క్లారిఫికేషన్ కోసం ప్రయత్నించినప్పటికీ స్పీకర్ చర్చ ముగిసినట్టు ప్రకటించడంతో సభ వాయిదా పడింది. అంతకు ముందు బడ్జెట్ పుస్తకాలను అధికార పార్టీ సభ్యులు వల్ల్లెవేశారు. గురువారం నుంచి పద్దులపై చర్చ కొనసాగనుంది.