Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమగ్రశిక్ష, గురుకుల కాంట్రాక్టు ఉద్యోగులనూ రెగ్యులరైజ్ చేయాలి : టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యావంతులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) స్వాగతించింది. 80,039 ఖాళీలతో భారీ నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారనీ, అందుకనుగుణంగా సంబంధిత నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలనీ, సత్వరమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగార్థులు అన్ని నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు వీలుగా మధ్యలో తగినంత వ్యవధి ఇస్తూ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ సీఎం ప్రకటించారని వివరించారు. ఆ వ్యవధి నిర్ధిష్టంగా ఉండాలని కోరారు. ఆ కారణంతో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. భర్తీ ప్రక్రియలో న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్లు సమగ్రంగా ఇవ్వాల్సిన అవసరముందని సూచించారు. లేకపోతే టీఆర్టీ- 2017లాగా నియామకాలు మూడు, నాలుగేండ్లపాటు ఆలస్యమయ్యే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖలో 21,500 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు తెలిపారు. కానీ ప్రస్తుతం 13,086 ఖాళీలు మాత్రమే భర్తీ చేయనున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు ఇస్తే దిగువ పోస్టుల్లో పదివేల ఖాళీలు ఏర్పడతాయని వివరించారు. పదోన్నతులు ఇచ్చిన తర్వాత ఏర్పడే ఖాళీలనూ ప్రత్యక్ష నియామకాలకు నోటిఫై చేయాలని డిమాండ్ చేశారు. 11,142 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించటం హర్షణీయమని తెలిపారు. రాష్ట్రంలో ఇకనుంచి కాంట్రాక్టు నియామకాలు ఉండబోవనీ సీఎం ప్రక టించారని గుర్తు చేశారు. అయితే కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష, గురు కుల, ఆశ్రమ పాఠశాలలు తదితర విద్యా సంస్థల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు ఇంకా 25 వేలమందికి పైగా ఉన్నారని వివరించారు. వారందరి సర్వీసులనూ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు సంతృప్తికరంగా లేవనీ, మరిన్ని నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు.