Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పశు సంవర్ధక శాఖలోని ఉద్యోగ ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం(జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ బుధవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 80,039 ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనలో పశుసంవర్ధక శాఖలోని మొత్తం ఖాళీలను ప్రకటించకుండా గొర్రెల పెంపకందార్లను, రైతులను, నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. పశుసంవర్ధక శాఖలో 1,423 పోస్టులు ఖాళీలుండగా కేవలం 353 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమని తెలిపారు. కిందిస్తాయిలో రైతులకు ప్రత్యక్షంగా సేవలందించే ఆఫీస్ సబార్డినెట్ పోస్టులు 1,003, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 07, డ్రైవర్ పోస్టులు 02, షెఫర్డ్ పోస్టులు 02, వీడిఓ, రిఫ్రిజిరేటర్ మెకానిక్ లాంటివి మరో 100 పోస్టులు ఖాళీలున్నాయని తెలిపారు. వీటిని భర్తీ చేయకుంటే పశువులకు వైద్యం అందే పరిస్థితి ఉండబోదని పేర్కొన్నారు. డాక్టర్లకు ఎక్కువ శాతం స్పెషల్ ఆఫీసర్ డ్యూటీలు, మండల ప్రోటోకాల్ మీటింగులకు తిప్పడం, సంక్షేమ పథకాల అమలుకు బ్యాంకులచుట్టూ తిప్పడం, గొర్రెలు, బర్రెల కొనుగోలుకు పంపించడం వల్ల వైద్యం అండటంలేదని తెలిపారు. ఇప్పుడున్న వీఏఎస్,ఏడీ, డీడీ, జేడీలకు ప్రమోషన్లు ఇస్తే వందలాది డాక్టర్ పోస్టులు ఖాళీలు ఏర్పడతాయని పేర్కొన్నారు. దీంతో సమస్య ఎదురవుతుందని తెలిపారు. పశు వైద్యుల నియామకాల్లో కూడా డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ద్వారా కాకుండా టీఎస్పీఎస్సీి అప్పగించడంతో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి శాఖలోని అన్ని ఖాళీలను భర్తీ చేయాలనీ, ఆర్ఎల్యూ సెంటర్లను అప్ గ్రేడ్ చేయాలనీ, పదోన్నతులు కల్పించిన ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన పశుసంపద లెక్కలను పరిగణలోకి తీసుకుని ప్రతి ఐదు వేల పశువులకు ఒక పశువైద్యాధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా డాక్టర్ పోస్టులను డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు.