Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్నీ పర్మినెంట్ చేయాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర విభజనకు ముందున్న వారినే కాకుండా మిగతా కాంట్రాక్టు ఉద్యోగులందరికీ న్యాయం చేయాలనీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులనూ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 91,417 ఉద్యోగ ఖాళీలకు గానూ 80,039 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని, 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని సుమారు 1,80,000 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 20 ఏండ్ల నుంచి ఆయా శాఖల్లో పనిచేస్తున్నారనీ, వారిని పర్మినెంట్ చేయకుండా విస్మరించడం అన్యాయమని తెలిపారు.కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్రంలో సుమారు 40,000 మంది ఉంటారనీ, వారందరికీ న్యాయం చేయాలని కోరారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంపై సాగిన తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో కాంట్రాక్ట్ కార్మికులతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా భాగస్వాములేనన్న విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని సూచించారు. ఉద్యోగ భద్రత, పర్మినెంట్, ఇతర సమస్యల సాధన కోసం రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తలపెట్టే పోరాటాలకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.