Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2,399 ఖాళీలను మాత్రమే చూపడం మోసం
- తెలంగాణ గిరిజన సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం నిరాశ, నిస్పృహలకు గురిచేసిందనీ, 2,399 ఖాళీలను మాత్రమే చూపడం వారిని మోసం చేయడమేనని తెలంగాణ గిరిజన సంఘం( టీజీఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. ధర్మ నాయక్ ,ఆర్.శ్రీరామ్ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 32 శాఖల్లో 22 వేలకు పైగా గిరిజన బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నాటి ప్రభుత్వ శాఖలు నివేదికలు సమర్పించాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 13 వేల గిరిజన బ్యాక్లాగ్ పోస్టులు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో ప్రకటించందని గుర్తుచేశారు.
వాటిని భర్తీ చేయటంలో ఆంధ్ర పాలకులు మోసం చేశారనీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లతోపాటు బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. నాటి వాగ్దానాలకు భిన్నంగా 2,399 ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తున్నట్టు అసెంబ్లీలో సీఎం ప్రకటించడం గిరిజన నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుందని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్ల కాలంలో షెడ్యూల్ ప్రాంతంలోని ఐటీడీఏలు, ఇతర ప్రభుత్వ శాఖలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు, జోనల్ వ్యవస్థలో గిరిజన బ్యాక్లాగ్ పోస్టులతోపాటు అనేక కొత్త ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వందలాది గిరిజన గూడేలు, తండాలలో ఉపాధ్యాయ పోస్టులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం ఆరు శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లను పెంచకపోవడంతో గత ఎనిమిదేండ్ల కాలంలో వారికి రావాల్సిన విద్యా, ఉద్యోగాలతో పాటు రాజకీయరంగంలో తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న 13వేల గిరిజన బ్యాక్లాగ్ పోస్టులతో పాటు జిల్లాల విభజన, శాఖల విభజన, జోనల్ వ్యవస్థలో ఏర్పడిన గిరిజన ఖాళీ లన్నిటినీ భర్తీ చేసే విధంగా ప్రత్యేక గిరిజన నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదరటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.