Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమలుపై అనుమానాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల పాలాభిషేకాలు, బాజా భజంత్రీలు, సంబురాల వేడుకలు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కానీ అమల్లోనే సవాలక్ష అనుమానాలు. 2015 మే 13వ తేదీ ఆర్టీసీ కార్మికులకు కూడా ఇలాంటి హామీలే ఇచ్చారు. 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. స్వరాష్ట్రంలో సమ్మెలనేవే ఉండవనీ, ఫిట్మెంట్ తేదీకంటే ముందే కమిటీలు వేసి పే రివిజన్ ప్రకటించి సకాలంలో అమల్లోకి తెస్తామని యూనియన్ నాయకుల చప్పట్ల నడుమ ఘనంగా ప్రకటించారు. ఆ తర్వాతే ఆర్టీసీ కార్మికుల 55 రోజుల సమ్మె, దాని అణచివేత, 2019 డిసెంబర్ 2 ఆత్మీయ సమ్మేళన హామీలు, యూనియన్లు లేవనడం, 11నెలల క్రితం అదే అసెంబ్లీ వేదికగా త్వరలో ఆర్టీసీ కార్మికులకూ జీతాలు పెంచుతామనే ప్రకటనలు... అన్నీ తెలిసిన అంశాలే. ఆర్టీసీ కార్మికులకు 2015లో జరిగిన వేతన సవరణే చివరిది. ఆ సమావేశంలో చెప్పిన ఏ ఒక్క హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. వేతన బకాయిల్లో భాగంగా కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన బాండ్లకు ఐదేండ్ల కాలపరిమితి ముగిసినా, ఇప్పటికీ అతీగతీ లేదు. ఆ తర్వాత 2017, 2021 వేతన సవరణల ప్రస్తావనే లేదు. అప్పట్లోనూ ఆర్టీసీ కార్మికులు సహా, టీఆర్ ఎస్ శ్రేణులన్నీ ఇలాగే పాలాభిషేకాలు చేశాయి. ఇప్పుడు సర్కారు ప్రకటించిన దశలవారీ ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలను ఎప్పటి దాకా కొనసాగిస్తారనేది చర్చనీయాంశం. అలాగే పోడు వ్యవసాయదారుల సమస్యలను అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుని పరిష్కరిస్తానని అదే అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇప్పటికీ అది అచరణలోకి రాలేదు. ఇక ఏటా జాబ్ కేలండర్ ప్రకటించి, ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీచేస్తామనడమూ...ఆర్టీసీ కార్మికుల ఫిట్మెంట్ తరహాలోనూ ఉంటుందా అనే సందేహాలూ లేకపోలేదు. ఇలాంటి అనేక సంచలన నిర్ణయాలను ప్రకటించడం, ఆ తర్వాత వాటిని సా....గతీయడం ప్రభుత్వానికి ఆనవాయితీగా మారింది. ఈసారైనా అలాంటి సా....గతీత లేకుండా తక్షణ లక్ష్యాలను సాధిస్తే...యువతరానికి న్యాయం చేసినట్టే!!