Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజనితీజ్ఞుడు కేసీఆర్ : బాల్క సుమన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశానికి తెలంగాణ మోడల్ అవసరమని అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమాన్ అన్నారు. ఈ రోజు దేశానికి కావాల్సింది గుజరాత్ మోడల్ కాదనీ, తెలంగాణ మోడల్ అని వ్యాఖ్యానించారు. నేను ఎంపీ రెండుసార్లు గుజరాత్ వెళ్లా, అక్కడ ఏమీ లేదు..అంతా బ్లఫ్ అంటూ విమర్శించారు. నర్మదా డ్యామ్ ఎత్తు పెంచి మోడీ భుజకీర్తులు తగిలించుకున్నారనీ, కానీ 35 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లిచ్చిన అపరభగీరథుడు కేసీఆర్ అని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ అంటే అంకెల గారడీ, గణాంకాల గజిబిజి గతంలో అనేవారనీ, ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. కరోనాకాలంలోనూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుందన్నారు. దీనికి కేసీఆర్ పరిపాలనాదక్షతే నిదర్శనమని అన్నారు. బడ్జెట్ అంటే గతంలో అప్పులే ఉండే వనీ, ఇప్పుడు పరిస్థితి మారిందని గుర్తు చేశారు. దేశం కోసం ధర్మం కోసమంటూ మోడీ సర్కారు దేశాన్ని 95 లక్షల 48 వేల 487 కోట్ల అప్పుల్లో ముంచిందని ఆరోపించారు. ఎందుకు, ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారమే ప్రభుత్వం అప్పులు చేసిందని గుర్తు చేశా రు. పెట్టుబడి వ్యయంగా మార్చి రాష్ట్రం ఆస్తులను సృష్టిస్తు న్నదని చెప్పారు. మౌళిక సదుపాయాల కల్పన అద్బుతంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2014 నుంచి ఈ ఏడా దికి బాగా మెరుగైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.10.30 లక్షల కోట్లను ప్రజల కోసం ఖర్చుచేసిం దన్నారు. ఆర్థిక నిపుణులు అమర్త్యసేన్, బెంజిమెన్ ఇజ్రా యేల్ గతంలో ఆర్థిక వ్యవస్థల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పటి తెలంగాణకు సరిగ్గా సరిపోతాయని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలతో తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ మైందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితుల పై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. దళితులను గుడికి, బడికి దూరం పెట్టిందన్నారు. ఈ విషయంలో బీజేపీతోపాటు సభ్యసమాజం ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరారు. రైతుబంధు మాదిరిగానే దళితబంధును అమలవు తుందనీ, ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నదీజ లాల విషయంలో కొట్టుకోవడం కాదు, ప్రాజెక్టులు కట్టుకోవ డం కీలకమని కేసీఆర్ నిరూపించారని అన్నారు. టీఆర్ఎస్ ఎంపీలకు ఢిల్లీలో పోరాటంతోనే సరిపోతున్నదన్నారు. సింగరేణి నాలుగు బ్లాకులను ప్రయివేటుపరం చేసి అదానీకి అప్పగించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ కంపెనీలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ అమ్ముతున్నదని అన్నారు. బీజేపీ విధానం అమ్మకమైతే, టీఆర్ఎస్ది నమ్మకమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని బంగాళాఖాతంలో విసిరేయాలని కోరారు. అధ్యక్ష స్థానంలో తొలుత స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూర్చోగా, అనంతరం డిప్యూటీ స్పీకర్ టి. పద్మారావు సభను నడిపించారు.