Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చేసిన 80,039 పోస్టుల భర్తీ ప్రకటనతోనే నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) స్పష్టం చేసింది. ఆ పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఉద్యోగాల భర్తీపై తాత్సారం చేయొద్దని కోరింది. ఈ మేరకు డీవైఎఫ్ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎ విజరుకుమార్, రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ పీఆర్సీ నివేదిక ప్రకారం 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ సీఎం అసెంబ్లీలో 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించడం సరైంది కాదని తెలిపారు. పీఆర్సీ నివేదిక ప్రకారం 1,91,126 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటనలకు పరిమితం కాకుండా తక్షణమే నియామకాల ప్రక్రియ చేపట్టాలనీ, ఒకేసారి నోటిఫికేషన్లు వేసి ఖాళీపోస్టులను భర్తీ చేయాలని కోరారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని తెలిపారు. ఏడేండ్ల కాలంలో ఉద్యోగాల భర్తీ లేక, నిరుద్యోగ భృతి లేక 50 మందికిపైగా నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే బాధ్యత వహించి నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీలో నిరుద్యోగ యువకులు వన్‌టైం రిజిస్ట్రేషన్‌లో 28 లక్షలకుపైగా నమోదు చేసుకున్నారని వివరించారు. వారందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి అన్ని జిల్లాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కోరారు. ఏటా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని తెలిపారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా, ప్రకటనలకే పరిమితం కాకుండా ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.