Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాయిలకాడ మెటార్లకు మీటర్లు బిగించేది లేదు
- బీజేపీ వాట్సాఫ్ యూనివర్సిటీ ఫేక్ ప్రచారం
- ఉద్యోగాల భర్తీపై కేంద్రం శేత్రపత్రం విడుదల చేయాలి
- అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు
- కేంద్రం ఇచ్చేదాని కంటే రాష్ట్రమే ఎక్కువ ఇస్తుదని వివరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తే, ఏడాదికి రూ ఐదువేల కోట్లు ఇస్తామంటూ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆశలు పెట్టిందనీ, అయినా రాష్ట్ర ప్రభుత్వం తలవంచలేదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. బాయిలకాడ కరెంట్ మీటర్లు పెట్టి, రైతుల ఉసురుపోసుకోబోమంటూ సీఎం కేసీఆర్‌కు స్పష్టం చేశారని తెలిపారు. చాలా రాష్ట్రాలు కేంద్ర సంస్కరణలకు ఓకే అన్నాయనీ, రూ ఐదువేల కోట్లు తెచ్చుకుంటున్నాయని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అవస్థలు పడిన అన్నదాతలను స్వరాష్ట్రంలోనూ కష్టాలు పెట్టదల్చుకోలేదన్నారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చకు మంత్రి సమాధామిచ్చారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయాన్ని తప్పుపట్టారు. రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువగా నిధులు ఇస్తున్నదంటూ బీజేపీ వాట్సాఫ్ యూనివర్సిటీ ఫేక్ వార్తలు సృష్టిస్తున్నదని విమర్శించారు. అబద్దాల యూనివర్సిటీ గుట్టు విప్పుతామని తెలిపారు.గత ఎన్నికల్లో మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని దేశ ప్రజలకు హామీ ఇచ్చారని చెప్పారు. దీని ప్రకారం 15 లక్షల 63వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనీ, ఇవి కాకుండా రైల్వే, ఎస్ఐసీ, ఆర్మీ వంటి శాఖల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ, అందులో ఎన్ని భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యులు అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఇగ చేస్తాం.. ఆగ చేస్తామంటూనే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలకు చేతనైతే రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన బయ్యరం స్టీల్ ప్యాక్టరీ, రైల్వే కోచ్ ప్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ప్రాజెక్టులకు జాతీయ హోదా తదితర ముఖ్యమైన సమస్యలను సాధించాలని డిమాండ్ చేశారు. అసత్యాలు, అర్ధసత్యాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న నేతలకు, బీజేపీ ఫేక్ యూనివర్సిటీకి 'నోబెల్ బహుమతి' ప్రదానం చేయాలని కోరారు. కార్పొరేషన్ల ఔట్ కమ్ బడ్జెట్‌ను ఒక శాతం నుంచి రెండు శాతానికి పెంచుకునేందుకు అవకాశం కల్పించిదంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు. ఆర్థిక మంత్రిగా ఇదే సభలో పని చేసిన వ్యక్తి ఇంత అవగాహనా రాహిత్యంగా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులవాటాను అక్కడి ప్రభుత్వం సెస్ రూపంలోకి మార్చి, రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం ఇచ్చేదానికి కంటే కేంద్రానికి రాష్ట్రం చెల్లిస్తున్నదే ఎక్కువని తెలిపారు. పెట్రోల్, డిజీల్ ధరల వల్ల రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి మూడు లక్షల 30కోట్లు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టితో తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు.