Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కేసులో హైకోర్టు నిర్ణయం
- విచారణ నేటికి వాయిదా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ ఎమ్మెల్యేలు ఎం. రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్, టి.రాజాసింగ్‌లను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేసిన కేసులో అసెంబ్లీ కార్యదర్శికీ, అసెంబ్లీ సచివాలయ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్లు స్వయంగా వారిద్దరికీ నోటీసుల ప్రతులను అందజేయవచ్చునని తెలిపింది. బుధవారం సాయంత్రంలోగా వారిద్దరికీ నోటీసులు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ చేసిన తీర్మాన కాపీ పిటిషనర్లకు అందజేసేలా ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సస్పెండ్ చేస్తూ ఇచ్చిన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కాపీని హైకోర్టు తెప్పించుకోవాలన్న పిటిషనర్ల వినతిని కూడా తిరస్కరించింది. ప్రతివాదులు ఇద్దరికి నోటీసులు ఇస్తున్నామనీ, వారి వాదనను గురువారం విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య ధర్మాసనం బుధవారం ప్రకటించింది. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన ఈనెల ఏడో తేదీన తమను అన్యాయంగా సభ నుంచి సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలనీ, బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రిట్ దాఖలు చేశారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదించారు. సస్పెండ్ చేసినప్పుడు పేర్లను స్పీకర్ చదవాలన్న రూల్‌ను అమలు చేయలేదన్నారు. మంత్రి తలసాని పేర్లు చదివితే అసెంబ్లీ ఆమోదించడం చెల్లదన్నారు. బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కావాలన్న రాజ్యాంగ నిబంధనలకు ప్రభుత్వం తిలోదకాలివ్వడంపై పిటిషనర్లు నిరసన వ్యక్తం చేశారనీ, ఇద్దరు సభ్యులు తమ సీట్ల వద్దనే నిలబడి ఉంటే రాజాసింగ్ మాత్రమే స్పీకర్ దృష్టిని ఆకట్టుకునేందుకు పోడియం వద్దకు వెళ్లారని వివరించారు. ఇలా చేయడం సర్వసాధారణమన్నారు.
సీఎస్ లేఖపై నేడు వివరణ ఇస్తాం : హైకోర్టుకు తెలిపిన కేంద్రం
ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు అనుమతినివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాసిన లేఖపై తమ నిర్ణయాన్ని గురువారం వెల్లడిస్తామని కేంద్రం హైకోర్టుకు హామీ ఇచ్చింది. తమ లేఖపై కేంద్రం స్పందించేలా ఆదేశించాలని సీఎస్ సోమేష్‌కుమార్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కేంద్రం వివరణ ఇవ్వాలని న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశించింది. కేంద్రం నిర్ణయంపై గురువారం విచారిస్తామని తెలిపింది. ఐపీఎస్ అధికారి అభిషేక్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. ఆయన్ను తెలంగాణ సర్వీస్‌లోకి తీసుకోవాలని క్యాట్ మధ్యంతర ఆదేశాలిచ్చింది. నెలలు గడిచినా ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో అభిషేక్ కోర్టు ధిక్కరణ కింద దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో క్యాట్ ధర్మాసనం విచారించింది. ఈనెల 11లోగా ఆయన్ను తెలంగాణ క్యాడర్‌లోకి తీసుకోకపోతే తమ ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్న సోమేష్‌కుమార్‌ను ఏపీకి పంపుతామని క్యాట్ హెచ్చరించింది. అంతే కాకుండా సోమేష్‌కుమార్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అభిషేక్ విషయంలో వివక్షత చూపిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. క్యాట్ ఆదేశాల్ని అడ్డుకోవాలని సీఎస్ సోమేష్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. వాటి అమలుకు అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాశామనీ, ఈ లేఖపై కేంద్రం చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
నిందితుల్ని పగలే విచారించాలి....
శ్రీనివాస్‌గౌడ్ హత్యాయత్నం కేసులో హైకోర్టు
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యాయత్నం కేసు నిందితులు బి.విశ్వనాథ్, మున్నూరు రవిని ఈ నెల తొమ్మిది నుంచి 13వ తేదీ వరకు ఉద యం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల మధ్య కాలంలోనే పోలీసులు విచారిం చాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులకు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కస్టడీ పూర్తయ్యాక సంబంధిత మేడ్చల్‌లోని కోర్టులో వారిని హాజరుపర్చాలన్నారు. కస్టడీకి తీసుకునేముందు, పూర్తయ్యాక నిందితులకు వైద్య పరీక్షలు చేయాలన్నారు. కస్టడీ తర్వాత నిందితులను చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌కు అప్పగించాలని ఆదేశించారు. పోలీసుల కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నిందితులు దాఖలు చేసిన కేసులో హైకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.