Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్వెస్లీ
నవతెలంగాన-తుర్కయంజాల్
సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం తుర్కయంజాల్లోని ఎస్.ఎస్. ఆర్ గార్డెన్లో జిల్లా కమిటీ సభ్యులు కె.జగన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జాన్వెస్లీ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బడ్జెట్లో కోతలు విధించారన్నారు. దళితబంధు టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకుంటున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని గతంలో చెప్పిన కేసీఆర్ మాట మార్చి ఇప్పుడు మూడు లక్షలు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఏడేండ్ల పాలనలో అనేక విషయాల్లోనూ, ఉద్యోగాల విషయంలోనూ సీఎం మాట మార్చారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసేందుకు తమ పార్టీ క్షేత్రస్థాయిలో శ్రేణులను సిద్ధం చేస్తోందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, బి. సామెల్, మధుసూదన్ రెడ్డి, ఎం.రాజు, బి.కవిత, డి.జగదీశ్, ఎం.చంద్రమోహన్, తుర్కయంజాల్ కార్యదర్శి డి.కిషన్ తదితరులు పాల్గొన్నారు.