Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్, జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడూ ఎండగట్టాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్, జూలకంటి రంగారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని టీఎన్ఆర్ గార్డెన్లో సీపీఐ(ఎం) నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు వస్తున్నాయని, అన్ని రాజకీయ పార్టీలు అప్పుడే హడావుడి చేస్తున్నాయని తెలిపారు. ఎన్నడూ ప్రజల సంక్షేమం పట్టించుకోని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నాయని విమర్శించారు. ఓట్లు సీట్లు లెక్కచేయకుండా నిత్యం ప్రజాపోరాటాలు నిర్వహిస్తున్న ఎర్రజెండా కార్యకర్తలు ప్రజలను చైతన్యపర్చడంలో ముందుండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వాల విధానాలను వివరించి ఎండగట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో పార్టీ కేంద్రీకరించిందన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని సమాజం మొత్తం మెచ్చుకుంటుదని, పార్టీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో కార్యకర్తల్లో రాజకీయ చైతన్యం కల్పించేందుకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, రవినాయక్, భావండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, అయ్యూబ్, పోలేబోయిన వరలక్ష్మీ, గాదె పద్మ, వినోద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాల భర్తీ ఎన్నికల స్టంట్ కాకూడదు..
ఉద్యోగాల భర్తీ కేవలం ఎన్నికల స్టంట్‌గా మారకూడదని, ప్రతి సంవత్సరం ఖాళీలకు అనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.వెంకట్ అన్నారు. మిర్యాలగూడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 91 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పడం సరికాదన్నారు. ఇప్పటికే రెండు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతంలోనే ప్రభుత్వం లెక్కలు చెప్పిందని గుర్తు చేశారు. రోజురోజుకూ జనాభా పెరుగుతుందని అవసరాలు పెరుగుతున్నాయని, కొత్త జిల్లాలు, మండలాలు, మున్సిపాలిటీలు ఏర్పడ్డాయని.. దానికి అనుకూలంగా వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. వాటినన్నింటినీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ విషయంలో ఏ ప్రాతిపదికన లెక్కలు వేశారని, విద్యాశాఖలో ప్రమోషన్ ఇవ్వకపోవడం వల్ల తక్కువ పోస్టులు కనిపిస్తున్నాయని అన్నారు. కేవలం 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారనడం సరికాదన్నారు. విద్యాశాఖలో 25 వేలకు ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్టనుండటం వల్ల.. ఆయా పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులను భర్తీ చేయాలని కోరారు. భూ పంపిణీ చేయడం ద్వారానే పేదలకు స్వయం ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఐదు లక్షల ఎకరాల భూమిని అభివృద్ధి పేరుతో లాగేసుకున్నారని విమర్శించారు. అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, 13 లక్షల కోట్ల ఆస్తులను అమ్మి అమ్మకపు బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. రైతులకు మద్దతు ధర కల్పించే విధంగా చట్టం చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.