Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ నోటిఫికేషన్లపై తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగ ఖాళీల భర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అయితే ఇదే కేసీఆర్ గతంలో ఉద్యోగాలపై శాసనసభలోనూ, బయటా అనేక వాగ్దానాలిచ్చి విస్మరించారని గుర్తు చేశారు. ఈసారి అలాకాకుండా నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఒక ప్రకటనలో సూచించారు. దళిత బంధుపై అఖిలపక్ష సమావేశం సందర్భంగా అసలు రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలే లేవంటూ కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఇంకోసారి ఎన్నికల సందర్భంగా ఇంటికో ఉద్యోగమిస్తామంటూ చెప్పి.. ఆ తర్వాత అసెంబ్లీలో తానెప్పుడూ అలా అనలేదంటూ కొట్టిపారేశారని వివరించారు. గతంలో ఒకసారి మూడు లక్షలు, మరోసారి లక్షా 90 వేలు ఉన్నాయంటూ చెప్పిన సీఎం... ఇప్పుడు 80,039 పోస్టులను భర్తీ చేస్తామంటూ ప్రకటించారని గుర్తు చేశారు. అందువల్ల రాజకీయ కారణాల రీత్యా, ఎన్నికల రీత్యా, మరే కారణంతోనైనా సరే... ఆయన నోటిఫికేషన్లను వేస్తామంటూ ప్రకటించారని, ఆ ప్రకటనను అమలు చేసి చూపించాలని కోరారు. పోడు భూములకు సంబంధించి కూడా అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ వాగ్దానమిచ్చారని వివరించారు. సాగుదార్ల నుంచి పిటీషన్లు స్వీకరిస్తాం, వారందరికీ పట్టాలిస్తాం, అటవీ, పోలీసు అధికారులెవ్వరూ సాగుదార్లను ఇబ్బంది పెట్టబోరంటూ సీఎం హామీనిచ్చారని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకూ ఆ సమస్యను పరిష్కరించలేదనీ, పోడు సాగుదార్లపై కేసులు బనాయిస్తూనే ఉన్నారని తమ్మినేని తెలిపారు.