Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియామకాల ప్రక్రియ ప్రారంభం
- అన్ని పోటీపరీక్షలు రాసే వీలుగా నోటిఫికేషన్లు
- 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
- రాష్ట్రంలో మొత్తం ఉద్యోగ ఖాళీలు 91,142
- వయోపరిమితి పదేండ్లు పెంపు
- ఇక నుంచి ఏటా ఖాళీల గుర్తింపు.. ఉద్యోగ క్యాలెండర్ విడుదల
- రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.7 వేల కోట్ల భారం
- 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు దక్కే అవకాశం
- ఇప్పటివరకూ 1,33,942 పోస్టులు భర్తీ చేశాం : సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని శాసనసభ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారనీ, వారిని బుధవారం నుంచే క్రమబద్ధీకరణ చేస్తున్నట్టు వెల్లడించారు. యూనిఫామ్ సర్వీస్ అయిన పోలీసు శాఖ మినహాయించి అన్నింటిలోనూ గరిష్ట వయోపరిమితిని మరో పదేండ్లకు పెంచుతున్నామనీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 49 ఏండ్లు, ఓసీలు 44 ఏండ్లు, దివ్యాంగులు 54 ఏండ్ల వరకూ ఉద్యోగ నియామక పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా శాఖల వారీగా 91,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేలిందని చెప్పారు. ఒక విద్యాశాఖలోనే 25 నుంచి 30 వేల పోస్టులు ఉన్నాయన్నారు. కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ఆధారంగానే ఉద్యోగాల భర్తీ ఉంటుందనీ, అటెండర్ నుంచి ఆర్డీఓ పోస్టు వరకూ 95 శాతం స్థానికులకే దక్కేలా నిర్ణయం చేశామన్నారు. ఐదు శాతం ఓపెన్ కోటాలోనూ రెండు నుంచి నాలుగు శాతం వరకూ స్థానికుకే దక్కించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇక నుంచి ఎప్పటికప్పుడు శాఖల వారీగా ఖాళీలను గుర్తిస్తామనీ, ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర ఖజానాపై రూ.7 వేల కోట్ల భారం పడబోతున్నప్పటికీ రాష్ట్ర సర్కారు సాహసోపేత నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. గతంలో 1,56,254 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకూ 1,33,942 పోస్టులు భర్తీ చేశామనీ, మిగతావి వివిధదశల్లో ఉన్నాయని వివరించారు.
నీళ్లు..నిధులు..నియామకాలన్నీ మనకే
'తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన నిధులు మనకే దక్కుతున్నాయి' అని సీఎం కేసీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని హుడా భూములను అమ్మి ఆంధ్రాలో అభివృద్ధి చేసినా మన ప్రాంత నాయకులు సొంత, రాజకీయ ప్రయోజనాల కోసం గమ్ముగా ఉన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి తెలంగాణలో ప్రాజెక్టుల కట్టాలంటే సమైకాంధ్ర పాలకులు విస్మరించారని గుర్తుచేశారు. మన రాష్ట్రమొచ్చాక మన నీళ్ల వాటా మనం తెచ్చుకున్నామనీ, గోదావరిపై కాళేశ్వరం కట్టుకుని చూపెట్టామన్నారు. బీడుబారిన భూములన్నీ నేడు కళకళలాడుతున్నాయనీ, పంటల సాగు విస్తారంగా పెరిగిందని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో వాగుల ద్వారా కూడా నీళ్లు పారించాలనే కొత్త డిమాండ్ వస్తున్న నేపథ్యంలో అట్లాగే చేయండంటూ అధికారులను ఆదేశించామన్నారు. నీళ్లు రావన్నోళ్లకు నీళ్లు తెచ్చుకునీ, అంధకారం అవుతుందన్నోళ్లకు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో 24 గంటల కరెంటు ఇచ్చి చూపెట్టామని తెలిపారు. కృష్ణా, గోదావరి నీళ్ల వాటా తేల్చాలని కేంద్రంతో కొట్లాడుతున్నామన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణకు కాంట్రాక్టు ఉద్యోగులు వారసత్వంగా వచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ రంగంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులుండటం సబబు కాదని తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. 2014 జూన్ రెండో తేదీ నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని మానవీవ దృక్పథంలో రెగ్యులరైజ్ చేయాలని గతంలో చూస్తే కొన్ని రాజకీయ పార్టీల నేతలు, సంకుచిత మనసత్వం గలవారు కోర్టుకెళ్లి అడ్డుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం పట్టువిడకుండా న్యాయపోరాటం చేయడంతో గతేడాది డిసెంబర్ ఏడో తేదీన సంబంధిత రిట్పిటిషన్లను హైకోర్టు కొట్టివేస్తూ రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. అవరోధాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో ఆయా శాఖల్లో రాష్ట్ర అవతరణ కంటే ముందు నుంచే ఉన్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నామని ప్రకటించారు.
ఉట్టిగనే జీఎస్డీపీ పెరుగుతుందా?..
గుజరాత్, మహారాష్ట్రవి ఎందుకు పెరగట్లేదు ?
రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. సాగునీరు, 24 గంటల ఉచిత కరెంటు అందుబాటులోకి రావడంతో వరి ధాన్యం దిగుబడి చాలా పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ నుంచి అంత ధాన్యం కొనలేమంటూ చేతులెత్తేసిందని విమర్శించారు. ఏడువేలకుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా సరిపోవట్లేదన్నారు. కళ్లాలు సరిపోక రోడ్లపైనే ఓ దిక్కు వాహనాలు పోయేందుకు వదిలి..మరోపక్క కల్లాలు మార్చుకుని వడ్లు పోసుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలోని నినాదాలను ఆచరణలో చేసిచూపెడుతూ ముందుకెళ్తున్నామన్నారు. జీఎస్డీపీ ఉట్టిగనే పెరుగుతుందా? ఎప్పటినుంచో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎందుకో పెరగట్లేదు? అని ప్రశ్నించారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందన్నారు.
కేంద్రం తాత్సారం.. ఏపీ మోకాలడ్డటంతోనే ఆలస్యం..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ఎన్నో ప్రతిపాదనలకు కేంద్రానికి పంపామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కేంద్రం అనవసరంగా తాత్సారం చేసింది. దీంతో తానే స్వయంగా అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని కలిసి దానికున్న ప్రాధాన్యతను వివరించినా పెద్దగా పట్టించుకోలేదన్నారు. చివరకు ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢిల్లీలో పెట్టి నిరంతరం ప్రయత్నం చేశామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్విరామ కృషివల్లనే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైందన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టంలోని 9,10 షెడ్యూళ్ల కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధిలోని వివిధ వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు చెందిన ఆస్తులు, ఉద్యోగుల విభజన ముడిపడిందని తెలిపారు. ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం ఉందన్నారు.
ఎప్పుడో నిజాం కాలంలో రాజేంద్రనగర్‌లో కట్టిన అగ్రికల్చర్ యూనివర్సిటీలో, ఓయూ వర్సిటీ జాగాలో కట్టిన ఆర్టీసీ తార్నాక ఆస్పత్రిలో ఏపీ వాటాలు అడగటం సిగ్గుచేటన్నారు. అర్ధరహిత వివాదాలు, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసినట్టుండే దుర్మార్గపూరితమైన ఏపీ వైఖరికి తోడు కేంద్రం బాధ్యతారాహిత్యం, నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు.1919లోనే నిజాం కాలంలోనే స్థానికులకే ఉద్యోగాల పేరిట ముల్కీరూల్స్ తెస్తే ఉమ్మడి రాష్ట్ర పాలకులు వాటిని తుంగలోతొక్కి 20 శాతం స్థానికేతరులకు ఇచ్చారని విమర్శించారు. ఇప్పుడు ముల్కీ రూల్స్ తరహాలో కొత్త నిబంధనలు రూపొందించకున్నామన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలను, విధానాలను, జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు వచ్చేలా కార్యాచరణ రూపొందించుకున్నామన్నారు. 9, 10 షెడ్యూళ్ల కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధిలోని వాణిజ్యసంస్థలు, ఇతర సంస్థలకు చెందిన ఆస్తులు, ఉద్యోగుల విభజన పూర్తయితే మరో 20, 30 ఉద్యోగాలు కూడా అదనంగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అటు పొరుగున ఉన్న వేరే భాషలు మాట్లాడే కర్నాటక, మహారాష్ట్రతో మనకు పేచీ లేదనీ, ఇటుపక్కన ఉన్న ఏపీ నుంచే మనకు రక్షణ అవసరమని నొక్కి చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధి టీఆర్ఎస్కు ఓ టాస్కు
పిడికెడు మందితో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మొదలుపెట్టామనీ, 14,15 ఏండ్ల ఘర్షణ తర్వాత స్వరాష్ట్ర కాంక్ష నెరవేరిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీకి ఒక టాస్కు అనీ, మిగతా పార్టీలకు, నేతలకు రాజకీయాలు ఒక గేమ్‌గా మారాయని విమర్శించారు రాష్ట్ర మంత్రులు, తమ పార్టీ నేతలు మొన్నటిదాకా రైల్వే కేసులను ఎదుర్కొన్న తీరును వివరించారు. రాష్ట్రంలో రాజకీయ పెడధోరణులు ఇటీవల ఎక్కువ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పనికిరానివాళ్లు కూడా స్పీకర్‌పై అనవసర కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టనీయకుండా చూస్తున్నారనీ, తాము మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ తనను తాను పునదర్శించుకుకోవాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
ఒక్కప్పుడు జోకర్లు..నేడు హీరోలు...
తెలంగాణ వచ్చాక భాషాపరిరక్షణ సాధ్యమైందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఒక్కప్పుడు సినిమాల్లో తెలంగాణ భాషను జోకర్లకు పెట్టి హేళన చేశారనీ, స్వరాష్ట్రంలో తెలంగాణ భాషను హీరోలకు పెట్టకపోతే సినిమాలు నడవని పరిస్థితి వచ్చిందని వివరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
వర్సిటీల్లో పోస్టులు భర్తీ
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు.
ఖాళీల వివరాలు గ్రూపుల వారీగా
గ్రూప్-1 503
గ్రూప్-2 582
గ్రూప్-3 1,373
గ్రూప్-4 9,168
జోనల్‌వారీగా ....
1. జోన్-1 కాళేశ్వరం 1,630
2. జోన్-2 బాసర 2,328
3. జోన్-3 రాజన్ 2,403
4. జోన్-4 భద్రాద్రి 2,858
5. జోన్-5 యాదాద్రి 2,160
6. జోన్-6 చార్మినార్ 5,297
7. జోన్-7 జోగులాంబ 2,190
మొత్తం 18,866
మల్టీజోనల్ వారీగా ....
1. మల్టీజోన్-1 6,800
2. మల్టీజోన్-2 6,370
మొత్తం 13,170
జిల్లాల వారీగా ...
1. హైదరాబాద్ 5,268
2. నిజామాబాద్ 1,976
3. మేడ్చల్-మల్కాజిగిరి 1,769
4. రంగారెడ్డి 1,561
5. కరీంనగర్ 1,465
6. నల్లగొండ 1,398
7. కామారెడ్డి 1,340
8. ఖమ్మం 1,340
9. భద్రాద్రి కొత్తగూడెం 1,316
10.నాగర్‌కర్నూల్ 1,257
11.సంగారెడ్డి 1,243
12.మహబూబ్‌నగర్ 1,213
13. ఆదిలాబాద్ 1,193
14. సిద్దిపేట 1,178
15. మహబూబాబాద్ 1,172
16. హన్మకొండ 1,157
17. మెదక్ 1,149
18. జగిత్యాల 1,063
19. మంచిర్యాల 1,025
20. యాదాద్రి భువనగిరి 1,010
21. జయశంకర్ భూపాలపల్లి 918
22. నిర్మల్ 876
23.వరంగల్ 842
24. కొమ్రంభీమ్ అసిఫాబాద్ 825
25. పెద్దపల్లి 800
26. జనగాం 760
27. నారాయణపేట 741
28. వికారాబాద్ 738
29. సూర్యాపేట 719
30. ములుగు 696
31. జోగులాంబ గద్వాల 662
32. రాజన్నసిరిసిల్ల 601
33. వనపర్తి 556
మొత్తం 39,829