Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భట్టి విక్రమార్క డిమాండ్
- మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఒక్కరికీ రుణమివ్వలేదు:అక్భరుద్దీన్ ఆగ్రహం
- కేసీఆర్ రాజకీయనాయకుడు కాదు..రాజనీతిజ్ఞుడు:బాల్క సుమన్
- బడ్జెట్‌పై అసెంబ్లీలో వాడీవేడీ చర్చ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా పెరుగుతున్న సంపదను ప్రజలకు పంచాలని శాసనసభలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత బడ్జెట్ లేదని వ్యాఖ్యానించారు. గతంలో మాదిరిగానే అంకెలు, ంలెక్కలు ప్రజలను సంతృప్తిపరచలేదని వివరించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బుధవారం ప్రారంభమైన బడ్జెట్ చర్చలో ఆయా పార్టీలకు చెందిన శాసనసభాపక్ష నేతలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బడ్జెట్ ప్రజల అవసరాలు తీరేలా లేదని విమర్శించారు. రూ.2,56,951 కోట్లతో మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ 25 నుంచి 30 శాతం కోతపెట్టారని అన్నారు. ఘనంగా లెక్కలున్నాయనీ, అమల్లో మాత్రం కోతపెడుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. దీనిమూలంగా అంతిమంగా నష్టపోయేది సామాన్యులు ,రైతులు, బలహీనవర్గాలు మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయాలు అంచనాల పట్ల ప్రభుత్వానికి భ్రమలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రూ. 52 వేల కోట్లు అప్పులు చూపారని, ఇదేంది ? ఇంత మేర అప్పులు చేస్తారా ? ఇది ప్రమాదకరమని చెప్పారు. 2014 నుంచి ఇప్పటిదాకా భారీ అప్పులు చేస్తూ వచ్చారనీ, అలాగే చివరల్లో కోతలు పెట్టడం టీఆర్ఎస్ సర్కారుకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద బాగా పెరిగిందనీ ప్రభుత్వం చెబుతున్న మాట వాస్తవమైతే, ఆమేరకు వాటా ప్రజలకు చేరాలి కదా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఇండ్లుగానీ, ఇండ్లస్థలాలుగానీ ఇవ్వలేదని గుర్తు చేశారు.కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇండ్లే ప్రజలకు గతి అయ్యాయని వివరించారు. డబుల్బెడ్రూమ్ ఇండ్లకు రూ. మూడు లక్షలు సరిపోతాయా ? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి వేములు ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క సభను తప్పుదోవపట్టిస్తున్నారని స్పీకర్ దృష్టికి తెచ్చారు. మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రభుత్వాల్లో ఏమేరకు ఇచ్చారో చెప్పండి, మేము ఎప్పుడు డబుల్బెడ్రూమ్ ఇండ్లకు రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పలేదని అన్నారు. మళ్లీ భట్టి చర్చలోకి వస్తూ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే నాటికి, ఇప్పటికీ భారీగా ధరలు పెరిగాయని అన్నారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా డబుల్బెడ్రూమ్ ఇండ్లకు ఆర్థికసాయం చేయాలని సూచించారు. కనీసం రూ. ఎనిమిది నుంచి పది లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రి వేముల తిరిగి చర్చలో జోక్యం చేసుకుంటూ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా భట్టి విక్రమార్క వైఖరి ఉందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, డబుల్బెడ్రూమ్ ఇండ్లకు పోల్చడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. భట్టి విక్రమార్క మళ్లీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంచుల్లో పేదలకు సరులు ఇచ్చేవారనీ, ఇప్పుడు సంచులు, అందులో సరుకులు లేకుండా పోయాయని చెప్పారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని లెక్కలు చెప్పారు. రుణమాఫీని వెంటనే అమలుచేయాలని కోరారు. సబ్సీడీలు తగ్గాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా ఉన్నాయనీ, అందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర జరగడమే ఇందుకు సాక్ష్యమని అన్నారు. న్యాయవాద దంపతుల హత్య ఉదంతం మరో కారణమని వివరించారు. సంపద పెరిగిన నేపథ్యంలో ఉద్యోగుల పాత పింఛన్ విధానాన్నే కొనసాగించాలనీ, ఆ మేరకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛను ఇచ్చిందని అన్నారు. దూప దీప నైవేద్యానికి నిధులు పెంచాలనీ, బీసీ సబ్‌ప్లాన్‌ను పక్కాగా అమలుచేయాలని కోరారు. అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారనీ చెప్పారు. సంపద పెరిగిన రాష్ట్రంలో పన్నులు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. సంపద, అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై పత్రికల్లో ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయని అన్నారు. పర్మిషన్లు లేకుండా ప్రాజెక్టుల కడితే నష్టం జరగదా ? అని ప్రశ్నించారు. ఏపీలోని జగన్ సర్కారు ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు కడుతుంతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని అని నిలదీశారు. హరీశ్వర్రావును కాళేశ్వర్రావు పిలుస్తున్నారనీ, మరి ఏపీ దురగతాలు కనిపించడం లేదా అన్ని అన్నారు.
ఒక్కరీకి రుణమివ్వలేదు: అక్భరుద్ధీన్
రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ గత నాలుగేండ్లల్లో ఒక్క మైనార్టీ వ్యక్తి రుణమివ్వలేదని ఎంఐఎం పక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ విమర్శించారు. ముస్లింలను ఎస్సీ, ఎస్టీలుగా పరిగణిస్తామని చెప్పన కేసీఆర్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇందుకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంచి చేస్తే పొగడుతామనీ, చెడుచేస్తే ప్రశ్నిస్తామని అన్నారు. నేను మీ స్నేహితున్ని అందుకే మాట్లాడుతున్నానని చెప్పారు. టిమ్స్ ఆస్పత్రిని ఎందుకు బంద్ చేశారు ? అక్కడ పోస్టులను ఎందుకు తగ్గిస్తున్నారని అని ప్రశ్నించారు. ఉర్దూ మీడియం కోసం ప్రత్యేక డిఎస్సీ నిర్వహించాలని కోరారు. మైనార్టీ సంక్షేమ శాఖకు నిధులు కేటాయిస్తున్నా, ఖర్చు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీకి నిధులు పెంచాలనీ, పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కోరారు. తక్కువ బిల్లులతో ఆస్పత్రులు చికిత్స చేయడం లేదనీ, తద్వారా రోగులపై ఆర్థికభారం పడుతున్నదని చెప్పారు. మెడికల్ కాలేజీల విషయంలో తప్పుడు లెక్కలు చూపెడుతున్నారనీ, మూడేండ్లుగా మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఫైసా వ్యయం చేయడం లేదని వివరించారు. ఉద్యోగాల భర్తీ ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు నిధులు ఇవ్వకున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్న కేసీఆర్ సర్కారును అభినందించారు. రాష్ట్రాభివృద్ధి కోసం టీఆర్ఎస్తో కలిసి ముందుకు వెళతామని అన్నారు.