Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మదనాపురం
అప్పుల బాధతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయ నాగరాజు(38) తన రెండెకరా లతో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. పెట్టుబడుల కోసం అప్పులు చేశాడు. ఆశించిన స్థాయిలో పంటలు చేతికి రాకపోవడం, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తనలో తానే మదన పడుతూ ఉండేవాడు. తీవ్ర మనోవేదనకు గురైన రైతు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు స్థానికులతో కలిసి పొలం వద్దకు వెళ్లారు. విగతజీవిగా పడి ఉన్న నాగరాజును చూసి భార్య, కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు.
రైతుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.