Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం దృస్టి సారించిందనీ, రాష్ట్రంలో రాబోయేది తమ ప్రభుత్వమే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో విజయంతో గురువారం హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబురాలను నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తం తిరిగి టెంట్, ఫ్రంట్ పెడతానన్న కేసీఆర్ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారాలకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కేసీఆర్పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతున్నదన్నారు. నిరుద్యోగ సమస్యపై బీజేపీ పోరాటంతోనే ఉద్యోగాల భర్తీ ప్రకటన వచ్చిందని చెప్పారు. కేసీఆర్ డ్రామాల రావు అని విమర్శించారు. తెలంగాణలో ప్రజాసంక్షేమ పాలన రావాలని ఆకాంక్షించారు. కేంద్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదని, కేంద్ర నిధులను వాడుకోవడం లేదని తప్పుబట్టారు. రాజాసింగ్ మాట్లాడుతూ...నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు ప్రజలదేనన్నారు. యూపీలో గూండా, మాఫియా రాజ్యాన్ని యోగి సర్కారు ఖతం చేసిందన్నారు. యోగీ బుల్డోజర్లు తెలంగాణకు వస్తున్నాయనీ, కేసీఆర్ అవినీతిపాలనను కూలదోస్తాయని చెప్పారు. కేసీఆర్ అవినీతిపాలనను పెకలించే బాధ్యతను అమిత్షా బండిసంజరుకి అప్పగించారనీ, ఆయన సారథ్యంలోనే తాము ముందుకు సాగుతామని చెప్పారు. బీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ..ప్రాంతీయ పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా యూపీ ప్రజలు యోగీ సర్కారు వైపే మళ్లీ నిలిచారన్నారు. యోగి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు.
కులమతాలు, డబ్బు గెలిపించలేవు: ఈటల
కులతత్వం, మతతత్వం, డబ్బు గెలవడానికి పనిచేయవనీ, ప్రజల ప్రేమతో గెలుపు సాధ్యమవుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. మోడీ, యోగీ చరిష్మాతోనే యూపీలో గెలుపు సాధ్యమైందన్నారు. ఈగెలుపుతో రాష్ట్రంలోని చాలా మంది గుండెలు అదిరాయన్నారు. కేసీఆర్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ పాలన గాలికొదిలేశారనీ, బీజేపీని ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారని విమర్శించారు. గెలిచిన వారందరికీ అభినందనలు తెలిపారు.