Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన అధికారులు
- త్వరలోనే నోటిఫికేషన్ జారీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 13,086 పోస్టులున్నాయి. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే టెట్ అర్హత తప్పనిసరి. దీంతో టెట్ నోటిఫికేషన్‌కు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. శనివారం అసెంబ్లీలో విద్యాశాఖ పద్దుపై చర్చ ఉన్నది. ఉపాధ్యాయ ఖాళీలు, టెట్ నిర్వహణ, టీఆర్టీ ప్రకటన వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు టెట్ నోటిఫికేషన్‌పై చర్చించి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం రాగానే టెట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశమున్నది. అయితే రాష్ట్రంలో టెట్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు సుమారు ఐదేండ్లుగా ఎదురుచూ స్తున్నారు. రాష్ట్రంలో 2017, జులై 23న చివరి సారిగా టెట్ రాతపరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2011 నుంచి టెట్ అర్హత సంపాదిస్తే జీవితకాలం ఉంటుందని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) ప్రకటించింది.
టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలి : రామ్మోహన్‌రెడ్డి
టెట్ నోటిఫికేషన్‌ను వెంటనే జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పాఠశాల విద్యాశాఖలో 13,086, గురుకుల విద్యాసంస్థల్లో ఆరు వేల వరకు ఉపాధ్యాయ ఖాళీలు త్వరలో భర్తీ చేస్తామంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ నియామకాలకు టెట్ తప్పనిసరి అయినందున వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. కాలయాపన చేయకుండా టీఆర్టీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించాలని పేర్కొన్నారు.