Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జనాభాలో 50 శాతానికిపైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. గురువారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు లేవనెత్తిన సందేహాలను మంత్రులు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. బీసీ సంక్షేమానికి బడ్జెట్లో రూ.5597.55 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఉన్నత చదువులు, ఆర్థిక స్వావలంబన,ఆడబిడ్డ పెండ్లికి అండ, ఆత్మగౌరవ ఎజెండాగా బీసీ పద్దు రూపొందించామ న్నారు. గతేడాది కంటే కేటాయింపులు పెరిగాయని చెప్పారు.బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్‌కు చెరో రూ.300 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. బీసీ గురుకులాలకు రూ.774కోట్లు, స్కాలర్షిప్పులకు రూ.1316 కోట్లు, కళ్యాణలక్ష్మికి రూ.1850 కోట్లు కేటాయించామని తెలిపారు. కరోనా నేపథ్యంలో బీసీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి రుణాలను ఇవ్వలేకపోయామనీ, దానిపై సీఎంతో చర్చిస్తామని చెప్పారు.
గిరిజన సంక్షేమానికి సువర్ణ యుగం : మంత్రి సత్యవతి రాథోడ్
గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమానికి సువర్ణ యుగం అన్నారు. పోడు సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.సీఆర్టీల రెగ్యులరైజ్ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. నూతన గ్రామ పంచాయతీల కు జీఓ నెంబర్ 3ని సుప్రీం కోర్టు కొట్టివేసిందనీ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కనీసం సహకరించలేదని విమర్శించారు. ఈ విషయంలో గిరిజనులకు అన్యాయం జరుగకుండా చూస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని కోరారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లోని గిరిజనుల కోసం ఇండిస్టీయల్ పార్కులు ఏర్పాటు చేయాలనే భట్టి విక్రమార్క సూచనను పరిశీలిస్తామన్నారు.
దళితుల అభ్యున్నతి కోసమే దళిత బంధు : మంత్రి కొప్పుల
దళితుల అభ్యున్నతి కోసమే దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని షెడ్యూల్డ్, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. గురుకులాల ద్వారా ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్నామన్నారు. స్కాలర్‌షిప్‌ల పెండింగ్‌ను క్లియర్ చేస్తామన్నారు. అవసరమైన చోట ఎస్సీలకు ఇండ్ల స్థలాలను కొనిచ్చే అంశాన్ని పరశీలిస్తామన్నారు. అంబేద్కర్ కమ్యూనిటీ కేంద్రాల నిర్మాణం అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. దశలవారీగా రెసిడెన్షియల్ స్కూళ్లకు నూతన భవనాలను కట్టిస్తామని చెప్పారు. షాదీముబారక్ పెండింగ్ నిధులనువిడుదల చేస్తామన్నారు. ఉర్దూలో కార్యాలయాలకు పేర్లు రాయిస్తామనీ, బోర్డులు పెడతామని చెప్పారు.