Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విక్రయించే విషయంలో స్నేహితుల మధ్య గొడవ
- బండరాయితో మోది మిత్రుడిని హత్య చేసిన విద్యార్థులు
- వికారాబాద్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-పెద్దేముల్
సెల్‌ఫోన్ దొంగతనం ముగ్గురు స్నేహితుల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఫోన్ విక్రయించే విషయంలో తలెత్తిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. ఇద్దరు స్నేహితులు తమ స్నేహితుడిని బండరాయితో మోది హత్య చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తాండూర్ పట్టణం గాంధీనగర్ చెందిన ప్రశాంత్(16), మల్రెడ్డిపల్లికి చెందిన రాజు, అంతారం గ్రామానికి చెందిన జశ్వంత్ తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. ప్రశాంత్ ఇటీవల ఓ సెల్‌ఫోన్‌ను చోరీ చేశాడు. దాన్ని విక్రయించాలని స్నేహితులైన రాజు, జశ్వంత్‌కు అప్పగించాడు. వారు సెల్‌ఫోన్ తీసుకుని విక్రయించేందుకు వెళ్లగా షాపు యజమాని గమనించి దొంగతనం చేసిన ఫోన్‌గా గుర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన రాజు, జశ్వంత్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. దాంతో వారిపై ప్రశాంత్‌పై కక్ష పెంచుకున్నాడు. బుధవారం సాయంత్రం మాట్లాడదామని రాజు, జశ్వంత్‌ను పిలిచాడు. ముగ్గురు కలిసి పెద్దేముల్ మండల పరిధిలోని గోట్లపల్లి గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ముగ్గురి మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో రాజు, జశ్వంత్ ప్రశాంత్‌పై బండరాయితో దాడి చేసి హత్య చేశారు. అనంతరం తాండూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. పోలీసులు గోట్లపల్లి గ్రామ సమీపంలో రక్తపు మడుగులో ఉన్న ప్రశాంత్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పెద్దేముల్ పోలీసులకు నిందితులను అప్పగించారు. పెద్దేముల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.