Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నదుల అనుసంధానం చేస్తే ఊరుకోం
- బీజేపీ నేతలకు చాతనైతే ఎక్కువ నిధులు తేవాలి : మండలిలో కడియం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. శాసనమండలిలో గురువారం బడ్జెట్‌పై సాధారణ చర్చలో ఆయన పాల్గొంటూ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంపై ఆధారపడిన నాలుగు రాష్ట్రాలకు నీటిని పంచాలంటూ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదన్నారు. కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిలోనైనా తెలంగాణకు వాటా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టిందన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య నీటితగాదాల నెపంతో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీని కేంద్రం ఏర్పాటు చేసిందని చెప్పారు. కృష్ణానదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులున్నాయని వివరించారు. కానీ గోదావరి నదిపై ఉమ్మడి ప్రాజెక్టుల్లేకపోయినా జీఆర్ఎంబీని ఎందుకు ఏర్పాటు చేశారని కేంద్రాన్ని ప్రశ్నించారు. నదీజలాలపై కేంద్రం పెత్తనం చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదని చెప్పారు. నదుల అనుసంధానం చేసే ముందు ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవాలని కోరారు. శాస్త్రీయ అవగాహన లేకుండా నదులను అనుసంధానిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణకు నీళ్లివ్వకుండా ఎండబెడతారా?అంటూ కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించలేదని అన్నారు. తెలంగాణకు చేసిందేంటో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించారా?, విద్యాసంస్థలు తెచ్చారా?, గిరిజన వర్సిటీని నెలకొల్పారా?, బయ్యారం ఉక్కు పరిశ్రమకు అనుమతి ఇచ్చారా?, ఖాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారా?, అదనంగా నిధులు తెచ్చారా?అంటూ నిలదీశారు. బీజేపీ నాయకుల వైఖరి ఇలాగే ఉంటే శాసనమండలిలో ఒక్కరూ లేరనీ, భవిష్యత్తులో అసెంబ్లీలోనూ అదే పరిస్థితి పునరావృతమవుతుందని చెప్పారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారని అన్నారు. ఉడుత ఊపులకు భయపడేది లేదన్నారు. డిసెంబర్ తొమ్మిదో తేదీ తరహాలోనే మార్చి తొమ్మిది చరిత్ర సృష్టించిందని హెచ్చరించారు. 80,039 పోస్టుల ప్రకటన సంతోషకరమని అన్నారు. కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది సంక్షేమ బడ్జెట్అనీ, బడుగుల బడ్జెట్ అని అభివర్ణించారు.