Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనసభలో పొగడ్తల హౌరు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహారాజుల మెప్పు పొందడానికీ, వారి కీర్తిని నలుదిశలా విస్తరింపచేయడానికి రాజదర్బార్లలో వారిని పొగడ్తలతో ముంచెత్తేవారు. 'మీకు...మీరే సాటి' అంటూ ఆకాశానికెత్తేవారు. రాజులు, రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యం వచ్చింది. కానీ పొగడ్తల ధాటి ఏమాత్రం తగ్గలేదు. గురువారం శాసనసభ, శాసనమండలిలో అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను 'నభూతో నభవిష్యత్' అంటూ ఒకరిని మించి మరొకరు పొగడటానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వాధినేతను ప్రస్తుతించడం, తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయని చెప్పుకోవడం సహజం. దానికి మించి 'మీకు మీరే సాటి' అంటూ పొగడ్తల సునామీ సృష్టించి, దానిలో కొట్టుకుపోతూ, ప్రజల్నీ అటే లాక్కెళ్లాలనే తపన కనిపించింది. శాసనమండలిలో మంత్రులు టీ హరీశ్‌రావు, శాసనసభలో కే తారకరామారావు, గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, కొప్పుల ఈశ్వర్ తదితరులు మాట్లాడారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం బలంగా లేకుంటే, అధికారపార్టీ సభ్యులే ప్రతిపక్షపాత్ర పోషిస్తే, చర్చలు గాడితప్పి, వ్యక్తి ఆరాధనకు కేంద్రబిందువయ్యాయి. సభలో మాట్లాడటానికి ఏ చిన్న అవకాశం దొరికినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కీర్తించడానికే సభ్యులు ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ను విమర్శించడానికీ ప్రయత్నించారు. ఓ దశలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటూ పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. దానిపై కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క తీవ్ర అభ్యంతరమే వ్యక్తం చేశారు. మండలిలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా సీఎం కేసీఆర్‌ను స్తుతిస్తూనే ప్రసంగాలను కొనసాగించారు. తమది చేతల ప్రభుత్వం అని రుజువుచేసుకొనే ప్రయత్నం చేశారు. అయితే మధ్యాహ్నానికి సభలో అధికారపార్టీ సభ్యులు, మంత్రుల మాటల్లో కొంత తేడా కనిపించింది. అప్పటి వరకు బీజేపీ ఈ దేశానికే పనికిరాదంటూ విమర్శలు చేసిన టీఆర్ఎస్ సభ్యులు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రకటనల తర్వాత ఆ దూకుడును కొంత తగ్గించినట్టు కనిపించింది. సీఎం కేసీఆర్ సభకు రాలేదు. ఫ్రెండ్లీ ప్రతిపక్షంగా ఉన్న ఎంఐఎం ఓవైపు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే, మరోవైపు ప్రభుత్వాన్ని కీర్తిస్తూ కామెంట్స్ చేసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆపార్టీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో, ఆపార్టీ ఎమ్మెల్యేలు కొంత డీలా పడ్డారు. ఈనెల 7వతేదీ శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టాక, 8,9 తేదీలు సెలవులు ప్రకటించారు. గురువారం బడ్జెట్‌పై చర్చ జరిగాక మళ్లీ మూడు రోజులు సెలవులు ప్రకటించి, ఈనెల 14వ తేదీకి వాయిదా వేశారు. పెద్దల సభ ఈవారంలో కేవలం రెండ్రోజులు మాత్రమే జరగడం గమనార్హం.