Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతుసంఘం డిమాండ్ చేసింది.ఈ అంశాలపై రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారనీ, ప్రభుత్వం తక్షణమే స్పందించి అవసరమైన ప్రాంతాలకు యూరియాను సరఫరా చేయాలని కోరింది. పంటలకు ఇప్పుడు యూరియా వేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈమేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి సాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రంలో వానాకాలం 10.48 లక్షల టన్నులు, యాసంగి 7.06 లక్షల టన్నుల యూరియా అవసరమని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళికలో పొందుపరిచిందని పేర్కొన్నారు. అలాగే డీఏపీ 3.14 లక్షల టన్నులు, కాంప్లెక్స్ 15.18 లక్షల టన్నులు, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ 2.47 లక్షల టన్నులు, సింగ్ సూపర్ పాస్ఫేట్ 51 వేల టన్నులు మొత్తం 38.84 లక్షల టన్నులు ఎరువులు రాష్ట్రానికి అవసరమనీ, వీటన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఎరువులను కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎరువుల కొరత ఏర్పడిందని విమర్శించారు. సకాలంలో ఎరువులు వేయకపోతే పంటల దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలస్యంగా ఎరువులు వేస్తే పంటల ఉత్పాదకతకు ఉపయోగం ఉండదని గుర్తు చేశారు. ఎరువుల కోసం అధిక వడ్డీకి ప్రయివేటు అప్పుల తెచ్చారనీ, మార్కెట్లో వాటిని కొనుగోలు చేయడానికి వెళ్తే దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం యూరియాతో సహా ఎరువుల కొరతను అధిగమించే విధంగా తక్షణం మార్కెట్లోకి వాటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.